వికారాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతన్నకు ప్రతి సీజన్లోనూ నష్టాలే మిగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో అన్నదాత కుదేలవుతున్నాడు. బీఆర్ఎస్ హ యాంలో గ్రామగ్రామనా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఏ ఒక్క రైతూ నష్టపోకుండా మద్దతు ధర అం దించగా.. 29 నెలల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అన్యాయం చేస్తున్నది. జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి వరి కోత లు గత వారం రోజుల కిందట ప్రారంభం కాగా కొనుగోలు కేం ద్రాల ఏర్పాటులో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నది. రైతులు వరి కోతలు పూర్తి చేసి కల్లాలు, రోడ్లపై ఆరబెట్టి ప్రభుత్వం ఎప్పుడు కొంటుందా..? అని పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు దాపురించాయి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు గత రెండు, మూడు రోజులుగా జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా ప్రా రంభం కాలేదు. జిల్లాలో వరి కోతలు 40 శాతానికిపైగా పూర్తై నా ప్రభుత్వం ఇంకా కాంటా వేయకపోవడం గమనార్హం. ఈ సీజన్లో 1,05,000 ఎకరాల్లో వరి పంట సాగుకాగా, 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 129 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం దోమ మండలంలో రెండు కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించినా.. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించలేదు. ఏప్రిల్ మొదటి వారం నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులు సమావేశాలు నిర్వహించినా.. కొనుగోళ్లలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అకాల వర్షంతో పంట తడిచిపోతుందేమోనన్న భయంతో అన్నదాతలు తక్కువ ధర వచ్చినా..దళారులు, వ్యా పారులకు విక్రయిస్తూ నష్టపోతున్నారు.
మరోవైపు అకాల వర్ష సూచనతో రైతులు ధాన్యాన్ని ఆరబోసిన కల్లాలు, రోడ్ల వద్దనే రాత్రి, పగలు పడిగాపులు కాస్తున్నారు. గత యాసంగిలో ఏప్రి ల్ రెండో వారంలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా, ఈ ఏడాది ఇంకా ఆ కేంద్రాలను ప్రారంభించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సమయమివ్వకపోవడంతోనే కేంద్రాల ప్రారంభోత్సవంలో అధికారులు జా ప్యం చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు జిల్లాలో 129 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించగా.. వాటిలో ఐకేపీ ద్వారా 42 , పీఏసీఎస్ ద్వారా 49, డీసీఎంఎస్ ద్వారా 38 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రైతులకు క్వింటా ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2389, సాధారణ రకం క్వింటాల్‌కు రూ.2369 మద్దతు ధర చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500ల బోనస్‌ను అందించాలని నిర్ణయించారు.
మరో వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 129 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. జిల్లాకు 27 లక్షల గన్నీ బ్యాగులు అవసరమని అంచనా వేసి.. ప్రస్తుతం 19 లక్షల గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచాం.
– మోహన్ కృష్ణ, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్