రంగారెడ్డి, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన ప్రభుత్వం భూముల చుట్టూ తిరుగుతున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నాదర్గుల్లోని ప్రభుత్వ భూములను కాపాడాలని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం రంగారెడ్డి అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారన్నారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ భూములను బలవంతంగా లాక్కోని ముఖ్యమంత్రి తన అనుయాయులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఫ్యూచర్‌సిటి పేరుతో జిల్లాలో ఇప్పటికే వేలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములను బలవంతంగా తీసుకుని తనకు అనుకూలమైన కంపెనీలకు కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాదర్గులోని సర్వేనంబర్ 613లో 373 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని.. ఆ స్థలం సుమారు రూ. 7,000 కోట్ల విలువ చేస్తుందని, దానిని గత ముఖ్యమంత్రులు రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబునాయుడు, కేసీఆర్‌లు కాపాడుకుంటూ వచ్చారని గు ర్తు చేశారు.
కానీ, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఈ స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తున్నారన్నారు. ఈ భూమిని సాగు చేసుకుంటూ కొన్నేండ్లుగా 600 మంది రైతులు జీవిస్తున్నారన్నారు. ఈ భూమి ప్రభుత్వానికే చెందుతుందని, ప్రభు త్వ భూమేనని కందుకూరు ఆర్డీవోతోపాటు హైకోర్టు కూడా చెప్పిందని.. ఈ భూమిపై కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు లో ఉన్నదన్నారు. అయినా కొందరు ప్రైవేట్ వ్యక్తులు బలవంతంగా భూమిలోకెళ్లి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని.. వాటిని నిలిపేసి ఆ స్థలాన్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
నాదర్గుల్ భూముల కుంభకోణంలో రెవెన్యూ మంత్రి హస్తం ఉన్నది. ఆయన ప్రమేయం లేకపోతే వెంటనే ఆ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా వెంటనే ఆదేశాలివ్వాలి. ఈ భూమి ప్రభుత్వానిదేనని కోర్టులతోపాటు రెవెన్యూ అధికారులు చెబుతున్నా.. మరోవైపు ప్రైవేట్ వ్యక్తులు రౌడీలు, బౌన్సర్లను పెట్టి రైతులను లోపలికి రానివ్వకుండా నిర్మాణాలు చేపడుతున్నారు.
ప్రైవేట్ వ్యక్తులు అరాచకాలు సాగిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవ హరించడం చాలా దారుణం. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే నాదర్గుల్ భూములను ప్రైవేట్ వ్యక్తులు కాజేసేందుకు యత్నిస్తున్నారు. శిల్పా ఇన్ఫ్రా, కోహినూరు, మేఘా తదితర సంస్థలు ఈ భూములను కొట్టేసేందుకు చేస్తున్న యత్నాలను ప్రభుత్వం అడ్డుకోకపోవటం వెనుక కుట్రకోణం దాగి ఉన్నది. ప్రభుత్వం వెంటనే ఈ భూములను స్వాధీనం చేసుకోవాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుంది. -దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ
జిల్లాలో అనేక భూకుంభకోణాల్లో ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నది. అక్రమార్కులకు ఎమ్మెల్యేలు, మంత్రులు కొమ్ము కాస్తున్నారు. అం దులో భాగంగానే నాదర్గుల్లో రూ.7,000 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని దౌర్జన్యంగా పలు రియల్ఎస్టేట్ సంస్థలు కాజేసేందుకు యత్నిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఫ్యూచర్‌సిటీ పేరుతో విలువైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ప్రభుత్వం కాజేసింది.
తాజాగా నాదర్గుల్ భూములపైనా ప్రభుత్వ పెద్దల కన్ను పడడంతోనే ఈ వ్యవహారం సాగుతున్నది. అలాగే, కొహెడ గ్రామంలోని సర్వేనంబర్ 167 లోని 172 ఎకరాల మార్కెట్ భూమినీ కాజేసేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నది. భూములను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే కబ్జాదారులకు అండగా నిలిస్తే ప్రజలు ఎవరికీ చెప్పుకోవాలి. ఈ భూములను కాపాడేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తాం. -మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు