వికారాబాద్, ఏప్రిల్ 2, (నమస్తే తెలంగాణ): జిల్లాలో గత బీఆర్ఎస్ హయాంలో మిషన్ కాకతీయ కింద చెరువులు, కుంటల్లో పూడికతీతతోపాటు.. కాల్వలకు మరమ్మతులు చేపట్టడంతో వర్షాకాలంలో వచ్చిన నీటితో చెరువులు, కుంటలు కళకళలాడేవి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం చెరువులు, కుంటల్లోకి నీరొచ్చే కాల్వల మరమ్మతులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వర్షం నీరు చెరువులు, కుంటల్లోకి చేరక ఎండిపోతున్నాయి. దీంతో జిల్లాలో భూగర్భజలాలు పూర్తిగా అడుగుంటిపోతున్నాయి. నెల రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, బోర్లు, బావుల్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి.
గత నెలలో 50 శాతం మేర నీటి నిల్వలుండగా.. ప్రస్తుతం 90 శాతం మేర నీటి నిల్వలు తగ్గిపోయినట్లు అధికారుల అంచనాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలోని మూసీ పరీవాహక ప్రాంత రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. నవాబుపేట మండలంలోని గంగ్యాడతోపాటు నాలుగైదు గ్రామాల రైతులు సాగు చేసిన కూరగాయల పంటలు ఎండుతుండడం, బోర్లలో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోవడంతో మూసీ వాగులో ఊటలు కొట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు నాలుగైదు గ్రామాలకు చెందిన సుమారు వంద మంది రైతులు మూసీ వాగులో ఊటలు కొట్టి 3 హెచ్పీ మోటర్లు పెట్టుకొని 20-30 ఫీట్ల వరకు ఊట గుంతలు తీసి నీరందిస్తూ వేసిన పంటలను బతికించుకుంటున్నారు. మూసీ వాగులో ఐదు కిలోమీటర్ల మేర ఎక్కడా చూసిన ఊట గుంతలే కనిపిస్తుండడం గమనార్హం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో రాత్రి సమయంలో వెళ్లి ఊటల నుంచి పంటలకు నీరు పెడుతున్నారు. రాత్రంతా వాగుల వద్ద పడిగాపులు కాస్తూ ఎప్పుడు నీరు ఊరుతుందా, ఎప్పుడు పంటలకు నీరు పెడుదామా అని ఎదురుచూస్తూ రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
నాకు 4 ఎకరాల భూమి ఉన్నది. మూడున్నర ఎకరాల్లో కంది, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తాను. మూసీ నది దగ్గరలో అర ఎకర భూమి ఉన్నది. దీంతో పాలకూర, పుంటికూర సాగు చేస్తున్నా. ఆకుకూరలను హైదరాబాద్లోని కూకట్పల్లి మార్కెట్లో అమ్ముకొని వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకునేవాడిని. వీటికి నిత్యం నీరు కావాల్సి ఉంటుంది.
ఎండాకాలం రావడంతో మూసీ పూర్తిగా ఎండిపోయింది. చెరువులో ఇటాచి సహాయంతో రూ.5,500 ఖర్చు చేసి దాదాపు 2 గజాల లోతు తవ్వించి చెలిమెలా చేసి నీటిని తీశాము. అందులో మోటర్ వేసి పంటకు పారబెడుతున్నాం. ఆ నీరు కూడా కొద్దిసేపే వస్తున్నది. మళ్లీ నీరు వచ్చేంత వరకు ఆగాల్సి వస్తున్నది. నీళ్లు లేక ఆకుకూరల పెంపకానికి ఇబ్బందులు పడుతున్నాం. – కుర్వ రాములు, గంగ్యాడ, నవాబుపేట మండలం
ఊట నీటితోనే 2 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఎండాకాలం రావడంతో మూసీ ఎండిపోయి పంటలకు నీరు అందడంలేదు. నదిలో ఇసుక అధికంగా ఉంటంతో నీళ్లు అడుగంటిపోయాయి. జేసీబీ సహాయంతో రూ.6వేలు ఖర్చు చేసి దాదాపు 15 ఫీట్ల వరకు గుంత తవ్వాల్సి వచ్చింది.
నీరు రావడంతో 3హెచ్పీ మోటర్ సహాయంతో వరి పంటను సాగు చేస్తున్నా. అంతకు ముందు కూరగాయలు సాగు చేశాను. నదిలో నీరుంటే పంటలు బాగా పండేవి. మూసీ నదిపై దాదాపు 60, 70 మంది ఆధారపడి సాగు చేస్తున్నారు. మూసీలో ఇసుకను తొలగిస్తే నీళ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. చుట్టుపక్కల రైతులకు ఎంతో మేలు కలుగుతుంది.
– పసికె వెంకట్రాంరెడ్డి, గంగ్యాడ, నవాబుపేట మండలం