వికారాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నది. రేవంత్ సర్కార్ పవర్లోకి వచ్చి 20 నెలలు దాటినా ఇప్పటివరకు రూపాయీ కేటాయించకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. కనీసం చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్లలో డీజిల్ పోసేందుకు కూడా గ్రామ పంచాయతీల్లో డబ్బుల్లేకపోవడంతో బీఆర్ఎస్ హయాంలో మంజూరైన ట్రాక్టర్లను మూలన పడేశారు. సర్పంచుల పదవీకాలం పూర్తై ప్రత్యేకాధికారులు వచ్చి నా ఫలితం లేదు. పంచాయతీల్లో పనిచేసే కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మరోవైపు చిన్న చిన్న పనులకు పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బును ఖర్చు చేయగా ఇప్పటివరకు రూపాయీ విడుదల కాకపోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లావ్యాప్తంగా నిధులు లేకపోవడంతో పం చాయతీల నిర్వహణ అధికారులకు కష్టంగా మారింది. ప్రభుత్వం బిల్లులను విడుదల చేస్తుందన్న నమ్మకంతో మొదటి ఆరు నెలల వరకు అప్పులు చేసి ఖర్చు పెట్టిన పంచాయతీ కార్యదర్శులు.. తదనంతరం ఖర్చులు పెట్టే పనులకు దూరంగా ఉంటున్నారు.
మరోవైపు జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి రూ.29 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నది. ఈ బకాయిల కోసం మాజీ సర్పంచ్‌లతోపాటు పంచాయతీ కార్యదర్శులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్నారు. వేసవికాలం ముందు తాగునీటి మరమ్మతులకు సంబంధించి రూ.4 కోట్ల వరకు స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లతో అధికారులు పనులు చేయించగా, ఆ నిధుల కోసం వారు ఇంకా కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పంచాయతీలకు రావాల్సిన బకాయిల్లో కేంద్రం నుంచి వచ్చే బకాయిల కంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే బకాయిలే అధికంగా ఉన్నట్లు సమాచారం.
గ్రామ పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. సర్పంచ్ల పదవీకాలం ముగిసిన వెంటనే ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. నాటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. మరోవైపు పంచాయతీల్లో పాలనను చూడాల్సిన ప్రత్యేకాధికారులు నిధుల లేమితో పత్తా లేకుండా పోవడంతో సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యేకాధికారులుగా నియమించిన తర్వాత నెల రోజుల వరకు వారంలో రెండు, మూడు రోజుల వరకు గ్రామాలకు వచ్చిన అధికారులు తదనంతరం పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో వాటిపైపు రావడమే మానేశారనే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో స్వచ్ఛ పంచాయతీలుగా రూపుదిద్దుకున్న పల్లెల్లో నేడు పాలన పడకేసింది. కేసీఆర్ ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చి దేశంలో ఎక్కడాలేని విధంగా గ్రామాలను పచ్చగా మార్చి అవార్డులను సొంతం చేసుకోగా.. ఆ పల్లెలు నేడు నిధుల లేమితో సతమతమవుతున్నాయి. సమస్యల్లో
కూరుకుపోయాయి. ప్రభుత్వం ఏడాది కిందట ప్రత్యేకాధికారులను నియమించిందే తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్క రూపాయి కూడా జీపీలకు విడుదల కాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది.
గతేడాదిగా పంచాయతీ కార్మికులకు జీతాలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం డ్రైనేజీ పైప్లైన్లకు మరమ్మతులు చేయలేని దుస్థితి ప్రస్తుతం నెలకొన్నది. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికీ ఇచ్చిన ట్రాక్టర్లు ప్రస్తుతం మూలనపడ్డాయి. ట్రాక్టర్లకు ఈఎంఐ కట్టలేని పరిస్థితితోపాటు డీజిల్‌కు కూడా డబ్బుల్లేక వాటి నిర్వహణ భారంగా మారింది. ట్రాక్టర్లు మూలన పడడంతో ఇంటింటికెళ్లి తడి-పొడి చెత్త సేకరించే ప్రక్రియ కూడా గ్రామాల్లో నిలిచిపోయింది. దీంతో ఎక్కడ చూసినా చెత్తాచెదారమే దర్శనమిస్తున్నది.