కులకచర్ల, మే 17 : ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేపట్టకపోవడంతో కడుపుమండిన అన్నదాతలు రోడ్డెక్కారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ప్రతి గ్రామంలోనూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి రైతుకూ ప్రభుత్వ మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటే.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మా త్రం అన్నదాతలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నెల రోజులవుతున్నా సక్రమంగా కొనుగోళ్లు జరగడంలేదు. అన్నదాతలు తమ ధా న్యా న్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే పలు కొర్రీలు పెడుతూ కాం టా చేయడం లేదు.
దీంతో రైతులు రోజుల తరబడిగా అక్కడే నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొన్నది. కొనుగోలు కేంద్రం నిర్వాహకుల తీరును నిరసిస్తూ మండలంలోని కుస్మసముద్రం గ్రామానికి చెందిన పలువురు రైతులు తమ ధాన్యాన్ని వెంటనే కాంటా చేయాలని కులకచర్ల పెద్ద గేట్ చౌరస్తాలో ధర్నా నిర్వహించి.. అనంతరం కులకచర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి.. సమస్యను త్వరగా పరిష్కరించాలని తహసీల్దార్ మురళీధర్‌కు వినతిపత్రాన్ని అందించారు. తమ గ్రామంలో ఆలస్యంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, అది ఏర్పాటైన పది రోజులవుతున్నా కేవలం ఒక్క లారీ వడ్లను మాత్రమే రైస్‌మిల్లును పంపించారని.. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వడ్లను ఇంకా కొనడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కుస్మసముద్రం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేం ద్రాన్ని ఏర్పాటు చేయగా.. అక్కడి నిర్వాహకుల తీరుతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన 1500 గన్నీ బ్యాగులను రైతులకు పంపిణీ చేశారు. అయితే, గ్రామంలో పంట పెద్ద మొత్తంలో రావడంతో అన్నదాతలు కల్లాలు, రోడ్ల పక్కన ఆరబెట్టారు.
వాటిని కేంద్రానికి తీసుకొచ్చేందుకు సంచులను సరఫరా చేయాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం సంచుల స్టాకు తమ దగ్గర లేదని.. జిల్లా నుంచి వచ్చిన తర్వాతే ఇస్తామని.. అప్పటివరకు కేంద్రానికి వడ్లను తీసుకు రావొద్దని సూచిస్తున్నార ని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కల్లాలు, రోడ్ల పక్కన ఆరబెట్టిన వడ్లు అకాల వర్షానికి తడిచిపోతే మొలకలు వస్తాయని.. తమకు తీవ్ర నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలకు లారీలు సక్రమంగా రాకపోవడంతో కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో కేంద్రాల నిర్వాహకులు కాంటా అయిన వడ్లు రైస్ మిల్లులకు తరలిన తర్వాతే రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తామంటున్నా రు. ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని అరికట్టాలని రైతులు పేర్కొంటున్నారు.
కుస్మసముద్రం గ్రామంలో వారం రోజుల కిందటే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేవలం ఒక్క లారీ లోడ్‌ను మాత్రమే రైస్‌మిల్లును పంపించారు. తమ ధాన్యాన్ని తూకం వేయాలని కేంద్రం నిర్వాహకులను కోరితే.. ఇప్పటికే వడ్ల నిల్వలు ఉన్నాయి. అవి రైస్‌మిల్లులకు తరలిన తర్వాతే తీసుకురావాలని చెబుతున్నారు. వడ్లను పొలాల్లో ఉంచితే వర్షం వస్తే తడిచిపోతాయి. అధికారులు స్పందించి లారీలు సక్రమంగా కొనుగోలు కేంద్రానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
-డి చెన్నయ్య, రైతు కుస్మసముద్రం, కులకచర్ల
ధాన్యాన్ని పొలాల్లోనే నిల్వ చేశా. గన్నీ బ్యాగుల కోసం కొనుగోలు కేం ద్రానికి వెళితే తమ దగ్గర స్టాక్ లేదని.. వచ్చిన తర్వాతే ఇస్తామని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. గన్నీ బ్యాగులు ఇవ్వకుంటే కేంద్రానికి ధాన్యాన్ని ఎలా తీసుకురావాలి. పొలాల్లోనే వడ్లను ఉంచితే అకాల వర్షానికి తడిచిపోయే ప్రమాదం ఉన్నది. అధికారులు స్పందించి గన్నీ బ్యాగులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలి.
-డి శ్రీశైలం, రైతు కుస్మసముద్రం, కులకచర్ల
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చేందుకు అక్కడి నిర్వాహకులు గన్నీ బ్యాగులు ఇవ్వడంలేదు. తమ వద్ద స్టాక్ లేదని.. వచ్చిన తర్వాత ఇస్తామంటున్నారు. అకాల వర్షాలతో వడ్లు తడిస్తే చాలా ఇబ్బంది అవుతుంది. అధికారులు స్పందించి గన్నీ బ్యాగులను సకాలంలో పంపించి.. అన్నదాతలను ఆదుకోవాలి.
-హేమ్లీబాయి, మహిళా రైతు కుస్మసముద్రం తండా, కులకచర్ల