మర్పల్లి, జులై 16 : కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.. మూడు రోజుల క్రితం సిరిపురం ఎస్సీ హాస్టల్లో, మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చిన విషయం తెలుసుకుని బుధవారం సిరిపురంలోని హాస్టల్‌ను, మండల కేంద్రంలోని కేజీబీవీని సందర్శించి పరిశీలించారు. ముందుగా సిరిపురంలోని హాస్టల్‌ను సందర్శించి గదులను, బియ్యాన్ని పరిశీలించారు.. అక్కడ ఉన్న సిబ్బంది, విద్యార్థులతో మాట్లాడి జరిగిన విషయం తెలుసుకున్నారు.
దీంతో విద్యార్థులు తరచూ అన్నంలో పురుగులు వస్తున్నాయని, దాంతోపాటు నీళ్లలో కూడా పురుగులు వస్తున్నాయని ఆయన ముందు వాపోయారు. అనంతరం కేజీబీవిని సందర్శించి అక్కడ ఉన్న జిల్లా విద్యాధికారి రేణుకాదేవితో మాట్లాడారు.. పాఠశాలలోని విద్యార్థినులతో విద్యాలయంలోని సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డైలీ మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదని, మెనూ గోడకు అతికించడానికి తప్ప పాటించడం లేదని, రోజూ ఒకే రకమైన దొడ్డు రవ్వతో కూడిన ఉప్మా పెడుతున్నారని.. గుడ్లు, పండ్లు సరిగా ఇవ్వడం లేదని, బండలు కూడా వాళ్లే కడుగుతున్నట్లు తెలిపారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ ఎటు పోతున్నదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ప్రతి రోజూ గురుకులాల్లో సమస్యలు వస్తున్నాయని చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో గురుకులాల్లో తరచూ ఫుడ్ పాయిజన్ అనేది అభం శుభం తెలియని విద్యార్థుల పాలిట శాపంగా మారిందని, ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత విద్యార్థులకు సకాలంలో చికిత్స అందించకపోవడంతో ప్రాణాల మీదకు వస్తున్నదన్నారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడ..? ఇప్పుడు ఎవరిని పంపాలి జైలుకు అని ప్రశ్నించారు..? ఫుడ్ పాయిజన్ అయిన వసతి గృహల్లో విద్యార్థులందరికి ముందస్తుగా అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించి, అవసరమైతే ఆసుపత్రికి తరలించి, మంచి వైద్యం అందించాలని కోరుతున్నామన్నారు.
మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్య తీరు వల్ల ఇంకెంత మంది విద్యార్థులు ఆసుపత్రిపాలు కావాలి, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలి? నాటి సంక్షేమ పాఠశాలలు నేడు దుర్భరస్థితికి వచ్చాయంటే దీనికి కారణం ఎవరన్నారు..? చేతనైతే గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండని, కలెక్టర్ గురుకులాలను హాస్టళ్లను సందర్శించి సమస్యలు రాకుండా చర్యలు టీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మధుకర్, మాజీ వైస్ ఎంపీపీలు అంజయ్య గౌడ్, మోహన్ రెడ్డి, సర్పంచుల సంఘం మండల మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు మధుకర్, సొసైటీ డైరెక్టర్ యాదయ్య, నాయకులు గోపాల్‌రెడ్డి, గఫార్, కాజా, సోహెల్, శ్రీనివాస్, శ్రీకాంత్ ఇతర నాయకులు పాల్గొన్నారు.