పరిగి, అక్టోబర్ 21 : నిధులు మంజూరై రెండేళ్లు దాటింది, కాంగ్రెస్ సర్కారు వచ్చి రెండేళ్లు కావస్తుంది.. కనీసం టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించలేకపోవడంపై పరిగి పట్టణ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పరిగి పట్టణాభివృద్దికి సంబంధించి మున్సిపాలిటీకి ప్రత్యేకంగా కాంగ్రెస్ సర్కారు హయాంలో మంజూరైంది ఏమీ లేకపోగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన నిధులు సైతం ఖర్చు చేయడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తున్నది. నిధులు మంజూరు అటుంచి ఉన్న నిధులకు సంబంధించిన పనులు ప్రారంభించడంలో పాలకులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ సర్కారు వచ్చిన వెంటనే టెండర్లు పూర్తి చేస్తే ఇప్పటికే పనులు పూర్తయ్యేవి. కానీ కనీసం టెండర్ల దశ సైతం దాటలేదంటే ఎంత అలసత్వమనేది స్పష్టంగా తెలుస్తుందని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. 2023 జూలై 14వ తేదీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం టీయూఎఫ్ఐడీసీ ద్వారా పరిగి మున్సిపాలిటీలో అభివృద్ది పనులకు రూ.25కోట్లు మంజూరు చేసింది. ఆ వెంటనే పనుల ఎంపికతోపాటు అంచనాలు తయారు తదితర ప్రక్రియ చేపడుతుండగా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో టెండర్లు పిలవలేదు. ఎన్నికల కోడ్ కారణంగా ఈ ప్రక్రియ నిలిచింది. కానీ ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ సర్కారు నిధుల ఖర్చుపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది.
రెండేళ్లవుతున్నా పూర్తవ్వని టెండర్లు…
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఆనాటి మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ద్వారా పరిగి మున్సిపాలిటీకి రూ.25కోట్లు మంజూరు చేయించగా, కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు కనీసం వాటి టెండర్లు పూర్తి చేయలేకపోయింది. నిధులు మంజూరైన వెంటనే సంబంధిత వార్డులలో చేపట్టే పనులకు సంబంధించిన వివరాలను తయారు చేసి కలెక్టర్ ద్వారా టీయూఎఫ్ఐడీసీ వైస్ చైర్మన్‌కు పంపించారు. అంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రూ.25కోట్లతో చేపట్టే పనులను మార్పు చేసింది.
మొదట మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.5కోట్లు కేటాయించగా ఆ తర్వాత పెంచుతూపోయింది. చివరకు రూ.7.5కోట్లు మున్సిపల్ భవన నిర్మాణానికి కేటాయించి, మిగతా నిధులు వివిధ రోడ్లు, మురికికాలువలు, ఇతర పనులకు కేటాయించినట్లు సమాచారం. సరే ఈ పనులైనా ప్రారంభమయ్యాయా అంటే అదీ లేదు. గత డిసెంబర్ 15వ తేదీ ఈ పనులకు సంబంధించి రాష్ట్ర మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన జరిగి పది నెలలు దాటినా పనులు పత్తా లేకుండాపోయాయి. రెండేళ్లు కావచ్చినా టెండర్ల దశ దాటకపోవడం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గతంలో రెండు పర్యాయాలు టెండర్లు పిలిచినా అగ్రిమెంట్ దశలో టెండర్లు రద్దు చేసినట్లు సమాచారం. ఇదిలావుండగా ఇటీవల మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.7.5కోట్లకు సంబంధించి టెండర్లు పిలిచారు.
టెండరు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మిగతా నిధులకు సంబంధించి ఇంకా సాంకేతిక అనుమతుల దశలోనే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి మొదటి విడతలో రూ.15కోట్లు మంజూరు చేయించి పట్టణంలోని గంజ్‌రోడ్డు, తహసీల్దార్ కార్యాలయం రోడ్డు, గాంధీచౌక్ రోడ్డు వెడల్పు, తుంకులగడ్డకు రోడ్డు, పట్టణంలోని పలు కాలనీలలో అభివృద్ది పనులు పూర్తి చేయించారు. కానీ కాంగ్రెస్ సర్కారు ఉన్న నిధులు ఖర్చు చేయలేని స్థితిలో ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.25కోట్ల పనులు వెంటనే ప్రారంభించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా రూ.25కోట్లకు సంబంధించిన పనుల టెండర్లు పూర్తి చేయని అసమర్థ సర్కారుగా తేలిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదటి విడతలో రూ.15కోట్లు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ద్వారా మంజూరు చేయించి పట్టణంలో పలు అభివృద్ది పనులు పూర్తి చేశాము. రెండవ విడతలో రూ.25కోట్లు మంజూరు చేయించి టెండర్ల ప్రక్రియ దశలో ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ సర్కారు రెండు పర్యాయాలు అగ్రిమెంట్ దశలో టెండర్లు రద్దు చేసింది. ఇప్పటికీ రూ.25కోట్లకు సంబంధించిన పనుల టెండర్లను పూర్తి చేయలేక అసమర్థతను చాటుకుంది. కేవలం బీఆర్ఎస్కు పేరు వస్తుందనే దురుద్దేశంతోనే ఈ పనులు జరగకుండా అడ్డుకుంటున్నారు.
– కొప్పుల మహేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పరిగి