కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపటంలేదు. ఈ పథకం ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలోని రంగారెడ్డి జిల్లాలోగల మాడుగుల, ఆమనగల్లు మండలాల్లోని తదితర ప్రాంతాలకు సాగునీరు ఇవ్వాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.182 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో కాల్వల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ జరిపారు. అనంతరం కాల్వల నిర్మాణం కూడా 90 శాతం పూర్తయింది. ప్రభుత్వం మారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టు పురోగతిపై శ్రద్ధచూపటంలేదు. ఫలితంగా కాల్వల్లో చెట్లు మొలిసి అస్తవ్యస్తంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తామని, జంగారెడ్డిపల్లి నుంచి మోటర్ల ద్వారా సాగునీటిని మాడ్గుల, ఆమనగల్లు మండలాలకు అందిస్తామని హామీ ఇచ్చింది. కాని, ఇప్పటివరకు నిధులు కేటాయించకపోవటంతో పనులు ముందుకు సాగటంలేదు. దీంతో మాడ్గుల, ఆమనగల్లు మండలాల్లో సాగునీరు లేక పంటలు పెద్దఎత్తున ఎండిపోతున్నాయి.
– రంగారెడ్డి, మార్చి 18 (నమస్తే తెలంగాణ)
మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి మండలాలకు సాగునీటి సౌకర్యం లేకపోవటం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని భావించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెల్దండ, చారకొండ, కల్వకుర్తి మండలాలకు సాగునీటిని కూడా అందించింది. కాని, ప్రభుత్వం మారటంతో మాడుగుల, ఆమనగల్లుకు నీరందించలేకపోయింది. అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తిచేసి ఈ రెండు మండలాలకు సాగునీరు అందిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. కాని, నేటికీ హామీని నెరవేర్చలేకపోయారు.
సీఎం రేవంత్‌రెడ్డికి మాడుగుల మండలంతో విడదీయరాని బంధం ఉన్నది. ఆయనకు అత్యంత సమీప బంధువులు, ఆయన మామలు కూడా మాడుగుల మండలంలోనే ఉన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయితే తమ గ్రామాలకు సాగునీరు అందుతుందని ప్రజలు ఆశించారు. అయినా సాగునీరు మాత్రం రావటంలేదు. సాగునీరు అందించి రైతులను కాపాడాలని కోరుతున్నారు.
మాడ్గుల మండలంలోని మాడుగుల, ఆవుర్పల్లి, దొడ్లపాడు, నల్లవారిపల్లె, నాగిళ్ల, కలకొండ, తుర్కలకుంట, ఎండిపురం, ఆమనగల్లు మండలంలోని పోలెపల్లి, సింగంపల్లి, శంకరకుంటతండా, మేడిగడ్డతండా. ఈ గ్రామాలకు కాల్వలు కూడా తవ్వారు.
ప్రతిపాదిత కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన కాల్వ చివరి గ్రామాలకు సాగునీరు రాకపోవటంతో వరి, వేరుశనగ, మిర్చి పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు అడుగంటి బోర్లు సైతం ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితిలో సాగునీరు అందించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
కల్వకుర్తి ఎత్తిపోతలలో భాగమైన కాల్వ చివరి గ్రామాలకు సాగునీరు అందించాలి. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాం. పంటలు మధ్యలోనే ఎండిపోతున్నా పట్టించుకోవటంలేదు. కాంగ్రెస్‌వాళ్లు ఎన్నికల ముందు కల్లబొల్లి మాటలు చెప్పారు. కాల్వల నిర్మాణం పూర్తిచేస్తామని, చివరి గ్రామాలకు నీరందిస్తామని చెప్పారు.
– ఏర్పుల శివలింగం, ఆర్కపల్లి
కాల్వ చివరి గ్రామాలకు నీరులేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి, వేరుశనగ, మిర్చి పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు అడుగంటి బోర్లు సైతం ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా పంటలను సాగుకోసం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నీరందించేందుకు కాల్వల నిర్మాణం పూర్తిచేయటం కోసం నిధులు కేటాయించాలి. గత ప్రభుత్వం 90 శాతం పనులు పూర్తిచేసినప్పటికీ 10 శాతం పనులు పూర్తిచేయటంలో ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. పెట్టిన పెట్టుబడి కూడా రాలేని పరిస్థితితో ఇబ్బందులు పడుతున్నాం.
– కళ్లా రాజువర్ధన్రెడ్డి, ఆర్కపల్లి