రంగారెడ్డి, జూలై 30 (నమస్తే తెలంగాణ) : రెండో విడుత రుణమాఫీ జాబితాను చూస్తే.. రైతుల అనుమానాలు నిజమే అనిపిస్తున్నాయి. మొదటి విడుత మాదిరిగానే.. రెండో విడుతలోనూ ప్రభుత్వం భారీగానే కోత విధించినట్లు గణాంకాలను చూస్తే అర్థమవుతున్నది. రెండో విడుతలో రంగారెడ్డి జిల్లాలో 22,915 మంది రైతులకు సంబంధించి రూ.218.12కోట్ల మాఫీ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
రెండో విడుతలో అర్హుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఈ దఫాలోనూ ప్రభుత్వం భారీగానే కోతలు పెట్టినట్లు తెలుస్తున్నది. రూ.లక్షలోపు రుణాలు తీసుకున్నవారే జిల్లాలో లక్షకుపైగా ఉంటారని అంచనా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రెండు విడుతల జాబితాలు కలిపి 72,615 మంది రైతులకే రుణమాఫీని వర్తింపజేయడంపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అర్హుల జాబితాపై గోప్యత..
రెండోవిడుతకు సంబంధించి అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేయకపోవడంపై రైతుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం నాటికి కూడా అర్హుల జాబితా అధికారులకు అందలేదు. ఏయే బ్యాంకులకు సంబంధించిన రుణం ఎంత మాఫీ అయింది! అన్న వివరాలను మాత్రమే అధికారులకు అందించారు.
దీంతో రూ.లక్షన్నర రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో అయోమయం నెలకొన్నది. అసలు ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారన్న దానిపై రైతుల్లో సందేహాలు నెలకొన్నాయి. రైతుల వారీగా కాకుండా.. కేవలం బ్యాంకుల వారీగా రుణమాఫీ వివరాలను మాత్రమే ఇవ్వడం వల్ల.. ఎవరికీ రుణమాఫీ అయిందో? ఎవరికీ కాలేదో? ఎలా చెప్పాలని అధికారులు సైతం వాపోతున్నారు.
కలెక్టరేట్లో ఆరుగురికి లాంఛనంగా..
రెండో విడుత రుణమాఫీ కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించగా.. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని రైతులంతా వీక్షించేలా 23 రైతు వేదికల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాస్థాయిలో రెండో విడుత రుణమాఫీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించేందుకు రంగారెడ్డి కలెక్టరేట్లో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ శశాంక లాంఛనంగా రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆరుగురు రైతులకు సంబంధించిన రుణమాఫీ చెక్కులను పంపిణీ చేశారు. రెండో విడుత రుణమాఫీకి ప్రభుత్వం వెచ్చిస్తున్న రూ.218.12కోట్లకు సంబంధించిన జంబో చెక్కును సైతం ఈ సందర్భంగా అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి గీతారెడ్డి, జిల్లా కోఆపరేటివ్ అధికారి ధాత్రీదేవి, డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ సత్తయ్య, పలువురు డీసీసీబీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.
మొదటి విడుత ఫిర్యాదులకు లభించని పరిష్కారం..
మూడు విడుతల్లో రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఈనెల 19న మొదటి విడుతను ప్రారంభించింది. ఈ మేరకు జిల్లాలో సుమారు 49,700 మంది రైతులకు రూ.258.18కోట్లను రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నది. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ నంబర్, ఇతర వివరాలు లేకపోవడం.. అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో చాలామందికి రుణమాఫీ జరుగలేదు.
ఆదాయపన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులను అర్హుల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించడంతో మరికొంతమంది రైతులకు రుణ విముక్తి కలుగలేదు. ఇక జాబితాలో పేరు వచ్చినప్పటికీ జిల్లాలో 1,502 మంది రైతులకు సంబంధించి రూ.28కోట్ల వరకు మాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. మొదటి విడుతలో రుణమాఫీ కానివారి నుంచి వినతుల స్వీకరణకు జిల్లా వ్యవసాయ కార్యాలయంతోపాటు, మండలాల్లో ప్రభుత్వం హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలో మండల వ్యవసాయ అధికారులు, ఈఏవోలకు జిల్లావ్యాప్తంగా 1,161 మంది రైతుల నుంచి ఫిర్యాదులు అందాయి. వీటికి ఇంకా పరిష్కారం లభించలేదు. పరిష్కారానికై ఫిర్యాదులను రాష్ట్రస్థాయి అధికారులకు పంపించామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇక రెండో విడుతలోనూ ప్రభుత్వం గత షరతులనే వర్తింపజేస్తున్నది. దీనికితోడు ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే మొదటి విడుత పరిస్థితే రానున్నది. మళ్లీ రైతులు అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పదని రైతులు పేర్కొంటున్నారు.
రూ.లక్షన్నర రుణమాఫీకి సంబంధించిన వివరాలు మండలాల వారీగా..
మండలం : అర్హులైన రైతులు
అబ్దుల్లాపూర్‌మెట్ : 375
ఆమనగల్లు : 1,058
బాలాపూర్ : 42
చేవెళ్ల : 1,363
ఫరూఖ్‌నగర్ : 1,446
గండిపేట : 07
ఇబ్రహీంపట్నం : 955
చౌదరిగూడెం : 1,069
కడ్తాల్ : 1,344
కందుకూరు : 1,171
కేశంపేట : 1,628
కొందుర్గు : 884
కొత్తూరు : 392
మాడ్గుల : 2,479
మహేశ్వరం : 658
మంచాల : 1,319
మొయినాబాద్ : 661
నందిగామ : 507
షాబాద్ : 1,122
శంషాబాద్ : 327
శంకర్పల్లి : 859
తలకొండపల్లి : 2,234
యాచారం : 1,065
మొత్తం : 22,915