పరిగి, ఫిబ్రవరి 4 : మున్సిపల్ ఎన్నికల కోసమే అభివృద్ధి పనుల పేరిట కాంగ్రెస్ శిలాఫలకాలు వేసి హడావుడి చేసిందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పరిగి మున్సిపాలిటీలో అభివృద్ధి శూన్యమని దుయ్యబట్టారు. బుధవారం పరిగిలోని 15, 16, 17 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు మీదిగడ్డ శ్రీనివాస్, రహీమాబీ, ఎదిరె పద్మల తరపున పార్టీ ఇన్చార్జి శ్రీనివాస్‌రావుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిగిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు.
తహసీల్దార్ కార్యాలయం నుంచి పోస్టాఫీసు వరకు రోడ్డు వెడల్పుతోపాటు తుంకులగడ్డ వరకు ప్రధాన రహదారి వెడల్పు, బ్రిడ్జి నిర్మాణం వల్ల పాత పరిగి ప్రాంతంలో రవాణా సదుపాయం మెరుగుపడిందని తెలిపారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ద్వారా మొదటి విడతలో రూ.15 కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేయించడం జరిగిందని, అభివృద్ధి పట్టణ ప్రజల కళ్లముందు ఉందన్నారు. రెండో విడతలో రూ.25 కోట్లు మంజూరు చేయించగా.. ఎన్నికలు రావడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు టెండర్లు పూర్తి చేసేందుకే రెండేళ్ల సమయం పట్టిందంటే వారికి పరిగి అభివృద్ధిపై ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తుందన్నారు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రత్యేకంగా పరిగిలో చేపట్టిన అభివృద్ధి పనులేవీ లేవని విమర్శించారు. కేవలం హామీలు ఇవ్వడం, వాటిని తుంగలో తొక్కడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, భాస్కర్, పట్టణ అధ్యక్షుడు మంగు సంతోష్‌కుమార్, నాయకులు దుంపలి వెంకటేశ్, అశోక్, ఆంజనేయులు, సునంద, మంజుల పాల్గొన్నారు.