వికారాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : ఆగస్టు 15లోపు రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం.. రుణమాఫీ అమలుకు షరతులు విధించడంపై రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు దఫాల్లో రూ.లక్షలోపు రుణమాఫీ ప్రక్రియను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేసింది.
అన్ని వర్గాల ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు మల్లగుల్లాలు పడుతున్నది. ఇప్పటికే వానకాలం సగం అయిపోవస్తున్నా రైతుభరోసాపై స్పష్టత లేదని రైతులు విమర్శిస్తున్నారు. పెట్టుబడి సాయం అందకపోవడంతో విత్తనాలు, ఎరువుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించిన పరిస్థితి వచ్చింది. రైతు భరోసాపైనే క్లారిటీలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణమాఫీపై రోజుకోమాట మాట్లాడుతూ అన్నదాతలను అయోమయానికి గురి చేస్తున్నది.
రుణమాఫీ అమలుకుగాను రేషన్‌కార్డు తప్పనిసరిగా ప్రామాణికమని ప్రకటించిన ప్రభుత్వం, సర్వత్రా వ్యతిరేకత రావడంతో వెనక్కి తీసుకొని కేవలం కుటుంబ సభ్యుల గుర్తింపునకు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని మరో ప్రకటన జారీ చేసి, పట్టాదారు పాసుపుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. పీఎం కిసాన్‌ను ప్రామాణికంగా తీసుకుంటామని కూడా ప్రభుత్వం ప్రకటించడంపై జిల్లా రైతాంగం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతున్నది.
మరోవైపు ఆగస్టు 15లోపు రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేస్తామని హామీనిచ్చి ఇప్పుడు కేవలం రూ.లక్షలోపు పంట రుణాల మాఫీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభించేందుకు నిర్ణయించారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీకి నెలరోజులు కూడా లేకపోవడం, ప్రస్తుతం కేవలం రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేసేందుకు నిర్ణయించడంపై ఇంతటితో చేతులెత్తేస్తారేమోనన్న అయోమయం రైతుల్లో నెలకొన్నది.
రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులు 46,633..
పంటల సాగు కోసం బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలకు సంబంధించి రూ.2 లక్షల్లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీనిచ్చింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న రుణాలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
మొదట రుణమాఫీ అమలుకుగాను రేషన్‌కార్డు ప్రామాణికంగా అర్హుల గుర్తింపు ప్రక్రియ చేపడుతామని పేర్కొన్నది, తదనంతరం తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో రేషన్ కార్డు కాకుండా పట్టాదారు పాసుపుస్తకమే ప్రామాణికమని వెల్లడించింది. రేషన్ కార్డు కుటుంబ సభ్యుల నిర్ధ్దారణ కోసమే పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించింది.
రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులను గుర్తించి రుణమాఫీ అమలు చేసినట్లయితే ఇప్పటికే వేరుగా ఉంటున్న అన్నదమ్ములను ఒకే కుటుంబ పరిధిలోకి తీసుకొని ఇద్దరు తీసుకున్న రుణాలను కలిపి కుటుంబం యూనిట్‌గా రుణాలను మాఫీ చేయనున్నారు. దీంతో చాలా మంది రైతులకు అన్యాయం జరుగనున్నది. పట్టాదారు పాసు పుస్తకాలు వేరుగా అయినప్పటికీ రేషన్ కార్డులు మాత్రం కొత్తగా మంజూరు చేయకపోవడంతో ఒకే రేషన్ కార్డుతో ఉమ్మడి కుటుంబం కొనసాగుతూ వస్తున్నది.
అయినప్పటికీ భూములు భాగాలుగా చేసుకోవడంతో వేర్వేరుగా రుణాలు కూడా బ్యాంకుల నుంచి పొందారు. ఇప్పుడు కుటుంబ సభ్యులను రేషన్‌కార్డు ఆధారంగా పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొనడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌కార్డును పరిగణనలోకి తీసుకునే ఆలోచన ఉన్నప్పుడు ముందు రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ వ్యక్తమవుతున్నది.
ప్రభుత్వ నిర్ణయంతో కేవలం కొంత మంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరనున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.లక్షలోపు రుణాల మాఫీతో రూ.1.20 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా, కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న కొర్రీలతో సగం మంది రైతులకు కూడా లబ్ధి చేకూరే పరిస్థితి లేకపోవడం గమనార్హం. మరోవైపు ప్రస్తుతం కేవలం రూ.లక్షలోపు పంట రుణాలను మాత్రమే మాఫీ చేసేందుకు నిర్ణయించి, గురువారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు నిర్ణయించింది. జిల్లాలో రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతులు 46,633 మంది ఉన్నారు.
కొర్రీలు పెట్టడం సరికాదు..
రేషన్‌కార్డుతో సంబంధం లేకుండా రుణమాఫీ చేయాలి. పట్టాపాసు బుక్కు ఆధారంగా రుణాలను మాఫీ చేయాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. రుణమాఫీ కోసం రైతులు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాక రైతులు అయోమయానికి గురవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రుణమాఫీ చెప్పింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా, ఇప్పుడు రుణమాఫీలో కొర్రీలు పెడుతున్నది. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ప్రతి రైతు రుణాన్ని మాఫీ చేయాలి.
– రమేశ్ గౌడ్, కోట్‌మర్పల్లి, మర్పల్లి మండలం
నిబంధనలు పెట్టడం సరికాదు..
రూ.2 లక్షల్లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక నిబంధనలు పెట్టడం సమంజసం కాదు. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల్లోపు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలి.
– వడ్డె వెంకట్రాములు, మోత్కూర్ గ్రామం, దోమ మండలం
నిబంధనలు లేకుండా రుణమాఫీ చేయాలి..
ఎన్నికల్లో ప్రకటించిన విధంగా ఎలాంటి నిబంధనలు లేకుండా రుణాలను మాఫీ చేయాలి. రుణమాఫీ విషయంలో కొర్రీలు పెట్టడం సరికాదు. ఎప్పుడో ఇచ్చిన రేషన్ కార్డుల ఆధారంగా రుణాలు మాఫీ చేస్తాననడం ఏమిటీ.. ఇది రైతులను మోసం చేసేందుకు పన్నుతున్న కుట్రే.
-ఎండీ మహబూబ్, రాంపూర్ గ్రామం, కోట్‌పల్లి మండలం
రైతులందరికీ న్యాయం చేయాలి..
రుణాలు తీసుకున్న రైతులందరికీ న్యాయం చేయాలి. రేషన్‌కార్డు ఉన్నవారికే అనడం సరికాదు. ఎక్కువ భూమి ఉన్న రైతులకు రేషన్‌కార్డులు ఉండవు. రేషన్ కార్డులు ఎప్పుడో ఇచ్చారు.. మళ్లీ కొత్తవి రాలేదు. రేషన్ కార్డులో ఉన్నవారు ఒకే కుటుంబంలో లేరు. పెండ్లిళ్లు అయ్యి వేరుగా ఉంటున్నారు. రైతులను మోసం చేయాలని చూస్తే గుణపాఠం తప్పదు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు గందరగోళంగా ఉన్నాయి.
– పి.నర్సింహారెడ్డి, మోమిన్‌ఖుర్దు గ్రామం, ధారూరు మండలం