జీహెచ్ఎంసీలోకి 27 పురపాలికల విలీన ప్రక్రియ లో ఒకవైపు గందరగోళం.. మరోవైపు అక్రమాల పర్వం కొనసాగుతున్నది. పురపాలికలను పక్కనే ఉన్న జోన్లకు బదిలీ చేయకుండా సుదూర ప్రాంతాల్లోని జోనల్ అధికారులకు స్వాధీన బాధ్యత అప్పగించడంపై ఇప్పటికే బడంగ్‌పేట మున్పిపాలిటీలోని అన్ని వర్గాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. చార్మినార్ జోన్లో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని ముక్తకంఠంతో తేల్చిచెబుతున్నారు. సర్కారు అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను మరింత ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ ఇతర పురపాలికల్లోని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజలకు అనువుగా ఉండేలా కేటాయింపు ఉండాల్సి ఉండగా, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా అప్పగింతలు చేయడం తగదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
శాస్త్రీయత లేకుండా అడ్డగోలుగా పురపాలికలను కలపడంపై స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా… విలీనం అయిన పురపాలికల్లో అభివృద్ధి పనులు కొనసాగించలేమని కాంట్రాక్టర్లు తేల్చి చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొందరు అధికారులు మాత్రం రికార్డుల స్వాధీనం ముసుగులో అక్రమాలకు తెరలేపారు. కాంట్రాక్టర్లతో మిలాఖత్ అవుతూ అందినంత దండుకుంటున్నారన్నారని స్వయంగా బాధితులు కొందరు ఆందోళన బాట పట్టారు. నార్సింగి మున్సిపాలిటీల్లో అడ్డగోలు అసెస్మెంట్లు, బడంగ్‌పేటలో బిల్లుల మాయజాలం జోరుగా సాగుతుండడం గమనార్హం.
– సిటీబ్యూరో/బడంగ్‌పేట/మణికొండ, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ)
కాంట్రాక్టర్లతో అధికారులు మిలాఖత్ కావడంతో ఫైళ్లు తారుమారైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఫైళ్లు పెట్టడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. బుధ, గురువారాల్లో బడంగ్‌పేట అధికారులు పంపిన చెక్కులను జీహెచ్ఎంసీ అధికారులు తిరిగి పంపడమే ఇందుకు నిదర్శనం. బడంగ్‌పేటలో 8 చెక్కులు రిటన్ చేశారని, వాటి విలువ రూ. కోటి పైన ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. చెక్కు లు రిటర్న్ పంపిన తర్వాత కూడా అధికారులు ఇంకా పాత తేదీల్లో డీడీలు తీసుకోవడంపై అనుమానాలకు తావిస్తున్నది. చేసిన పనులకు ముందే బిల్లులు తీసుకొని చేయని వాటికి పాత ఫొటోలు పెట్టి రికార్డు చేసినట్లు తెలిసింది. ఇదే క్రమంలోనే చెక్కులకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారుల పరిశీలనలో మరో రెండు వందల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయన్న చర్చ జరుగుతున్నది.
రంగారెడ్డి, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ను ప్రభుత్వం జీహెచ్ఎంసీలో కలపడంతో ప్రజ లు అయోమయానికి గురవుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్లడం ద్వారా ఏమా త్రం ప్రయోజనం ఉండదని పలు గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. గత కేసీఆర్ ప్రభు త్వం జిల్లాలోని పలు మేజర్ గ్రామాలతోపాటు మరికొన్ని పల్లెలను కలుపుతూ మున్సిపాలిటీలను ఏర్పాటుచేసింది. మున్సిపాలిటీల ఏర్పాటుతో ప్రభుత్వం నుంచి నిధులు అధికంగా వచ్చి గ్రామాలు త్వరగా అభివృద్ధి చెందాయని.. అంతేకాకుండా భూముల ధరలు పెరిగి ప్రభుత్వానికి అధికంగా ఆదాయం వస్తున్నదని పలువురు పేర్కొంటున్నారు.
జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా నీటి, ఇంటి, నిర్మాణ పనులు భారీగా పెరుగుతాయని అధికారులు సూచనప్రాయంగా వెల్లడించారు. మున్సిపాలిటీలుగా ఉన్నప్పుడు భవన నిర్మాణా లు, ఇంటి పన్నులు, తాగునీటి కనెక్షన్లకు సంబంధించిన పన్నులు అంతంతమాత్రంగానే ఉండే వి. జీహెచ్ఎంసీలో కలపడం ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లు, 700 సర్కిళ్లు, కొత్తగా మరో 36 సర్కిళ్లు పెరుగనున్నాయి. హైదరాబాద్ నగర పాలక సంస్థలో అమలయ్యే నిబంధనలు కొత్తగా జీహెచ్ఎంసీలో కలిసే ము న్సిపాలిటీలు, కార్పొరేషన్లకూ వర్తించనున్నాయి. కొత్తగా నిర్మించే విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు, ఎన్వోసీల జారీ కఠినతరం కానున్నది.
జిల్లాలోని 8 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లను ప్రభుత్వం మూడు ముక్కలుగా చేయడం తో జిల్లా ఉనికికే ప్రమాదం ఏర్పడింది. పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీలను ఎల్బీనగర్ జోన్లో కలపాల్సి ఉండగా, చార్మినార్ జోన్లో విలీనం చేయడంతో.. ఆ మున్సిపాలిటీల్లోని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దిగొచ్చిన ప్రభుత్వం వాటిని ఎల్బీనగర్ జోన్లో విలీనం చేసింది. అలాగే, శంషాబాద్, జల్పల్లి తదితర మున్సిపాలిటీలను చార్మినార్ జోన్లో విలీనం చేయడంతో ప్రజలు తీవ్ర నిరసన తెలపడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
బడంగ్‌పేటలో అడ్డగోలుగా చెక్కులు ఇస్తున్నారం టూ కాంట్రాక్టర్లు శుక్రవారం గొడవకు దిగారు. పనిచేయని వారికి చెక్కులు జారీ చేసి పనిచేసిన వారు చెక్కులు అడిగితే డబ్బులు లేవని గత కొన్ని నెలలుగా కమిషనర్ సరస్వతి పేర్కొన్నారని కాంట్రాక్టర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. టెండర్ వేయకుండా రూ.లక్ష ఫైల్ ఒకటి పెట్టారన్నారు. ప్రస్తుతం రెండు వందల పైచిలుకు లక్ష రూపాయలకు సంబంధించిన ఫైళ్లు ఓ ఇన్చార్జి మేనేజర్ పెట్టించినట్లు పేర్కొన్నారు. అంతా ఆయన ఇష్టానుసారంగానే బిల్లులు పెట్టినట్లు కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.
శానిటేషన్ విభాగంలో చేయ ని పనులకు లక్ష రూపాయల బిల్లులు రూ. కోట్లలో పెట్టినట్లు ఆరోపించారు. ఇద్దరు బినామీ కాంట్రాక్టర్లను పెట్టుకొని అధికారులే ఇదంతా నడిపిస్తున్నారని ఆరోపించారు. నిజాయితీగా పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లు లు ఇవ్వకుండా పర్సంటేజీ ఇచ్చిన వారికే చెక్కులు జారీ చేసినట్లు కాంట్రాక్టర్ ఆరోపించారు. దీనిపై విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.
జీహెచ్ఎంసీ విలీన ప్రక్రియపై కొందరు కాంట్రాక్టర్లలో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను చేసేందుకు అధికారులు జంకుతున్నారు. తాము ఇప్పుడు పనులను చేయలేమని, ఒకవేళ చేసినా ఇప్పట్లో బిల్లులు రావడం కష్టమని చెబుతున్నారు. గ్రేటర్లో విలీనమైతే అంతా కుదురుకునే వరకు ఆరు నెలల సమయం పడుతుందని, అప్పటి వరకు డబ్బులు వెచ్చించి వడ్డీలు కట్టలేమని పలువు రు కాంట్రాక్టర్ల వాపోతున్నారు. ఇందుకు నిదర్శనం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నప్పుడు నెల రోజుల కిందట హిమగిరినగర్కాలనీలో ..
రోడ్డు నంబర్-2లో రోడ్డు పనులను ప్రారంభించారు. దీంతో స్థానిక బీఆర్ఎస్ నాయకుడు కోళ్ల నాగరాజు గతంలోనే రోడ్డును తవ్వి వదిలి వేయడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన మరుసటి రోజు కాంట్రాక్టర్‌తో చర్చించి పనులను ప్రారంభించారు. కాగా సదరు కాంట్రాక్టర్ మళ్లీ అదే రోడ్డులో కంకర పోసి రోజులు గడుస్తున్నా.. అటు వైపు రావడం లేదని స్థానికులు, స్థానిక నాయకుడు నాగరాజుతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీం తో ఆయన మరోసారి కాంట్రాక్టర్‌తో ఫోన్లో సంప్రదించగా, అన్నా.. ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలిసింది. వర్క్ చేసినా బిల్లులు రావడం ఆలస్యమవుతుందని సదరు కాంట్రాక్టర్లు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే నిలిచిన రోడ్డు పనులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విలీన నేపథ్యంలో ఈ నెల 4(గురువారం) తేదిన నార్సింగి మున్సిపల్ కార్యాలయ బోర్డులను మార్చి జీహెచ్ఎంసీ సర్కిల్ పేరిట బోర్డును ఏర్పాటు చేశా రు. విలీనమైన మరుసటిరోజే ఓ వివాదస్పద భూ మిలో ఇళ్లు ఉన్నట్లుగా ఇంటి నంబర్ కేటాయించినట్లు తెలిసింది. విలీనం ఈ నెల 3న సాయంత్రం ఏడు గంటల మధ్యలో అధికారులు వచ్చి రికార్డుల ను, మినిట్ బుక్కులను, డిజిటల్ కీని స్వాధీన పర్చుకున్నారు. కానీ 4వ తేదీ ఓ వివాదస్పద భూమికి అసెస్మెంట్ చేసి ఇంటికి పంబర్ కేటాయించారని తెలిసింది.
ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులకు లక్షల్లో చేతులు మారినట్లు ప్రచారం జరుగుతున్నది. జీహెచ్ఎంసీగా మారిన తర్వాత మున్సిపాలిటీ పేరుమీద ఇంటి నెంబర్లను కేటాయించడం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల మధ్య జరుగుతున్న వివాదాస్పద భూమికి లబ్ధ్దిచేకూర్చేలా ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగులు సహకరిస్తుండటంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. అక్రమదారిలో అసెస్మెంట్లు జరిపిన తీరుపై కమిషనర్ విచారణ చేపించాలని కోరుతున్నారు.
బడంగ్‌పేట సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న మేనేజర్ శ్రీధర్ రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. విలీనం నేపథ్యంలో రికార్డుల స్వాధీన ప్రక్రియలో శ్రీధర్‌రెడ్డి అన్నీ తానై నడిపించారు.అన్ని విభాగాలలో ఆయనదే ఆధిపత్యం. రెగ్యులర్ మెనేజర్ ఉన్నప్పటికి కమిషనర్ సరస్వతి అన్ని విభాగాల బాధ్యతలను శ్రీధర్ రెడ్డికి అప్పగిస్తూ సర్కూలర్ జారీ చేశారు. సిబ్బందిని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారన్న విమర్శలు ఉన్నాయి.
జీహెచ్ఎంసీలో విలీనం కావడానికి సమయం పడుతుందన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లతో మిలాఖత్ అయి అంతా నడిపించారని ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకు చెక్కులు ఇప్పించారన్న ప్రచారం సాగుతున్నది. రాత్రి పగలు తేడా లేకుండా పనులను చక్కబెట్టారని, చివరకు కార్యాలయంలోని తన కుర్చీలోనే శ్రీధర్‌రెడ్డి గాఢ నిద్రలోకి జారుతున్న తీరు పట్ల ఉద్యోగులు తీవ్ర చర్చ సాగుతున్నది. ఎవరితో మాటా మంతి లేకుండా కునుకు తీస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.