బొంరాస్‌పేట, జనవరి 24 : భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం రెండు వేర్వేరు సబ్జెక్టులు. వీటిని బోధించడానికి ఒక్కో సబ్జెక్టుకు ఒకరు చొప్పున వేర్వేరుగా ఉపాధ్యాయులు ఉంటారు. కానీ పరీక్షల విషయానికి వస్తే మాత్రం రెండింటిని కలిపి సామాన్య శాస్త్రం పేరుతో ఒకే పరీక్షను నిర్వహించేవారు. దీంతో విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురై సామాన్యశాస్త్రంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోలేక, ఉత్తమ జీపీఏ సాధించలేక తీవ్రంగా నష్టపోయేవారు. భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం పరీక్షలను వేర్వేరుగా నిర్వహించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎన్నో ఏండ్లుగా కోరుతున్నా విద్యాశాఖ మాత్రం పట్టించుకోలేదు.
రెండు సబ్జెక్టులకు కలిపి ఒకే పరీక్షను నిర్వహించడం వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురై గతేడాది ఎస్సెస్సీలో ఉత్తీర్ణత శాతం కూడా గణనీయంగా తగ్గింది. దీనిని గమనించిన విద్యాశాఖ ఈ ఏడాది నుంచి ఎస్సెస్సీ వార్షిక పరీక్షల్లో భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలకు వేర్వేరుగా రెండు రోజుల్లో పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఎస్సెస్సీ వార్షిక పరీక్షల్లో ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లతో(హిందీ మినహా) పరీక్ష నిర్వహించేవారు. పేపర్-1ని ఒకరోజు, పేపర్-2ను మరుసటి రోజు నిర్వహించేవారు. కానీ సైన్స్ సబ్జెక్టు విషయానికి వస్తే భౌతికశాస్త్రం, జీవ శాస్త్రంలకు రెండు పేపర్లను ఒకేరోజు రెండు గంటల వ్యవధిలోనే నిర్వహించేవారు. కరోనా తరువాత ప్రభుత్వం అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే పేపర్‌తో పరీక్షను నిర్వహిస్తుంది. సైన్స్ పరీక్షను ఒకే రోజున నిర్వహించడం వల్ల విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యేవారు.
కొందరు ఆందోళనతో పరీక్షలను సక్రమంగా రాసేవారు కాదు. ఫలితంగా విద్యార్థులు సైన్స్‌లో ఫెయిలయ్యేవారు. భౌతికశాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టుల్లో విద్యార్థులకు ఎంత పట్టు ఉందో తెలిసేది కాదు. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఎస్సెస్సీ వార్షిక పరీక్షల్లో భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం సబ్జెక్టులకు వేర్వేరుగా వేర్వేరు రోజుల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది.
మార్చి 26వ తేదీన భౌతిక శాస్త్రం, 28వ తేదీన జీవశాస్త్రం పరీక్షలను నిర్వహిస్తారు. ఒక్కో పేపరుకు మూడు గంటల వ్యవధి ఉండగా ఈ రెండు పరీక్షలకు మాత్రం గంటన్నర వ్యవధిని కేటాయించారు. ఒక్కో పేపరుకు 50 మార్కుల చొప్పున కేటాయించారు. ఈ మేరకు ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. కాగా వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, గురుకులాలు, మాడల్ స్కూళ్లు, కేజీబీవీల నుంచి ఈ ఏడాది 13074 మంది విద్యార్థులు పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్నారు.
భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలను వేర్వేరుగా నిర్వహించడం చాలా సంతోషం. దీనివల్ల రెండు సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించడానికి అవకాశం కలుగుతుంది. వేర్వేరు రోజుల్లో రెండు పరీక్షలను నిర్వహించడం వల్ల చదువుకోవడానికి సమయం దొరుకుతుంది.
-సింధు 10వ తరగతి విద్యార్థిని, ఆశ్రమ పాఠశాల,
భౌతిక, జీవశాస్త్రం పరీక్షలను వేర్వేరుగా రెండు రోజుల్లో నిర్వహించడం వల్ల విద్యార్థులపై మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గతంలో ఒకేసారి ఒకరోజులోనే పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థులకు చదువుకోవడానికి సమయం ఉండేది కాదు. తీవ్ర గందరగోళానికి గురయ్యేవారు. భౌతిక శాస్త్రం జవాబులను బయాలజీలో, బయాలజీ జవాబులను భౌతికశాస్త్రం పేపర్లో రాసేవారు. ఇప్పుడు ఆ సమస్య రాదు.
-జగదీశ్వరి, జీవశాస్త్రం టీచర్, ఆశ్రమ పాఠశాల, బొట్లవానితండా