రంగారెడ్డి, మే 1 (నమస్తే తెలంగాణ) : సంస్థాగత మార్పులు, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం వంటి అంశాలపై గురువారం శంషాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశం గందరగోళంగా సాగింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఏఐసీసీ పరిశీలకుడు వంశీచందర్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి శివసేనారెడ్డి, మధుయాష్కీగౌడ్, జిల్లా ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, ఈర్లపల్లి శంకర్, మహేశ్వరం ఇన్చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమావేశం ప్రారంభంలోనే కార్యకర్తల మనోభావాలు తెలపాలని కోరడంతో పలువురు కార్యకర్తలు మూకుమ్మడిగా తమకు న్యాయం జరగడంలేదని ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీలో జెండా మోసినవారికే గుర్తింపు దక్కడంలేదని, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తున్నారన్నారు. తాను 44 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నానని, ఆలయ కమిటీలో నామినేటెడ్ డైరెక్టర్ అయినా ఇవ్వాలని కోరగా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఓ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశాడు.
పార్టీలోకి కొత్తగా ఎమ్మెల్యేలు, మరికొంతమందిని చేర్చుకుని వారి అనుచరులకు మాత్రమే పదవులు ఇప్పిస్తున్నారని, పాతవారికి ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు. నమ్ముకున్న నాయకులు కూడా పట్టించుకోకపోతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పార్టీని నమ్ముకుని ఎన్నో ఇబ్బందులకు గురైనా నిలదొక్కుకున్నవారికి సముచితస్థానం లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేసి పార్టీ కోసం కష్టపడి జెండా మోసినవారికి అవకాశం కల్పించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కార్యకర్తలను పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మైక్ తీసుకుని సర్దిచెప్పే ప్రయత్నంలో కార్యకర్తలకు, ఆయనకు వాగ్వాదం కూడా జరిగింది. ఏఐసీసీ పరిశీలకుడు వంశీచందర్‌రెడ్డి కల్పించుకుని కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తామని త్వరలోనే గ్రామ, మండల, జిల్లాస్థాయితో పాటు పార్టీ అనుబంధ విభాగాలన్నింటికీ కొత్తగా పదవులు వస్తాయని.. వాటిలో అందరికీ ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటూ ఇబ్రహీంపట్నంకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు.