రంగారెడ్డి, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, పదేండ్ల రాష్ట్ర ప్రగతిలోనూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర వెలకట్టలేనిదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. చివరి రోజైన సోమవారం శంషాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.
కార్యక్రమానికి మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, జైపాల్ యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వీట్లను పంపిణీ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన దశాబ్ది ఉత్సవ సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ప్రసంగించారు.
రానేరాదన్న తెలంగాణను ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన కేసీఆర్ పోరాట పటిమ, ఉద్యమ చతురత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. దేశ వ్యాప్తంగా 36 పార్టీలను ఒప్పించి తెలంగాణ ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చి అప్పటి యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి రాష్ర్టాన్ని సాధించిన చాణక్యరీతి అద్భుతమని పేర్కొన్నారు. కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, యువత, మహిళలు, కార్మికులు, కర్షకులు, మేధావులందరినీ ఏకం చేసి రక్తపు చుక్కకు తావులేకుండా ఉద్యమాన్ని నిర్మించి రాష్ర్టాన్ని సాధించడం అద్భుత ఘట్టమని పేర్కొన్నారు.
సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్ల సమర్థ పాలనలో అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలబెట్టారని కొనియాడారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు, గెలుపు, ఓటములు సహజమేనని తెలంగాణ ఉన్నంతకాలం తెలంగాణను తెచ్చిన గులాబీ జెండా రెపరెపలాడుతూనే ఉంటుందన్నారు. గాలివాటంగా, అబద్దాలతో గెలిచిన కాంగ్రెస్ పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అబద్ధాలనే నమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ ఒరవడిని కొనసాగించకుంటే కాంగ్రెస్ పార్టీ అనతికాలంలోనే కనుమరుగవడం ఖాయమన్నారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో బూత్ స్థాయి నుంచి పార్టీ పటిష్టంగా ఉన్నదని, కిందిస్థాయి నుంచి పార్టీ కమిటీలన్నింటినీ బలోపేతం చేసి సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, దశాబ్ది ఉత్సవాల ప్రేరణతో ఉద్యమ స్ఫూర్తితో పని చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వేడుకల్లో జడ్పీటీసీలు నీరటి తన్విరాజు, అనురాధ, దశరథ్ నాయక్, ఎమ్మె శ్రీలత, రాగమ్మ రామకృష్ణ, ఎంపీపీలు జయమ్మ, నర్మద, మున్సిపల్ చైర్పర్సన్ కొలను సుష్మ, గజ్జెల మధుసూదన్‌రెడ్డి, గణేశ్‌గుప్తా, వెంకటేశ్ గౌడ్, చంద్రారెడ్డి, సతీశ్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.