సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ ) ; ఒక చేతితో చప్పట్లు రావు…పనుల్లో ఒక్క కాంట్రాక్టర్ లాలూచీ పడితేనే అవినీతి జరగదు..అధికారి కూడా కలిస్తేనే అది పరిపూర్ణమవుతుంది.. ఖజానాకు గండిపడుతుంది.. జీహెచ్ఎంసీలో ఇంజినీరింగ్ విభాగం తీరు ఇలాగే ఉంది. కాంట్రాక్టర్లతో మిలాఖత్ అయిన అధికారులు..మాన్సూన్ పనులను వినాయక ఉత్సవాల కింద చేపట్టినట్లు బిల్లులు చూపించి..అందినంత దండుకునేందుకు పావులు కదిపారు. అనుకున్న విధంగా జరిగి ఉంటే.. ఖాజానాకు భారీ ‘టెండర్’ పడేది. అయితే మల్కాజిగిరి సర్కిల్లో అక్రమాలు వెలుగులోకి రావడంతో అవినీతిపరులు వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. అయితే చాలా సర్కిళ్లలో ఇలాంటి అవినీతి జరిగిందని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక కమిటీ వేసి..సమగ్ర విచారణ చేపట్టి..చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గణేశ్ శోభాయాత్ర ఈ నెల 17న ఆనందోత్సాహాల నడుమ ప్రశాంతంగా ముగిసింది. వాస్తవంగా శోభాయాత్ర జరిగే మార్గాల్లో ముందస్తుగా రహదారులపై గుంతలు లేకుండా చూడటం, ఉన్న ప్యాచ్‌వర్క్‌ను పూర్తి చేయడం వంటి పనుల బాధ్యత ఇంజినీరింగ్ విభాగానిదే. ఇందుకోసం ఒక్కో సర్కిల్‌కు దాదాపు రూ. 80 లక్షల మేర బడ్జెట్ ప్రతిపాదనలను కమిషనర్ ఆదేశాల ప్రకారం జోనల్ కమిషనర్లు ఆమోదం తెలిపారు. ఈ సమయంలో శోభాయాత్రను దృష్టిలో ఉంచుకొని రెండు రోజుల ముందుగానే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులు చేపట్టాలి. కానీ డివిజన్ నంబర్ 28 విభాగం అధికారులు టెండర్ 12న పిలిచి 17న టెండర్‌ను తెరిచి.. ఏజెన్సీకి పనులు అప్పగించేందుకు ప్లాన్ చేశారు. ఇక్కడే శోభాయాత్ర 17వ తేదీ కంటే రెండు రోజుల ముందుగానే టెండర్ ప్రక్రియను ముగించి పనులు పూర్తి చేయాలి. 12న 24 గంటల వ్యవధితో షార్ట్ టెండర్ పిలిచే అవకాశం ఉంది. కానీ అధికారులు ఆరు రోజుల వ్యవధితో టెండర్ పిలిచి ఏజెన్సీని ఖరారు చేశారు. నాలుగు చోట్ల పనులకు రూ. 76.80 లక్షల వ్యయంతో టెండర్‌ను ముగించారు. షార్ట్ టెండర్‌ను ఒక్క రోజులో ముగించి 14వ తేదీలోగా సంబంధిత వర్క్‌ను ఎగ్జిక్యూషన్లోకి తీసుకురావాల్సిన చోట అవినీతికి తెరలేపారు. ఇందుకు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ పనులను ఎంచుకున్నారు.
వచ్చే వారంలో బిల్లు పెట్టి..
వర్షాకాల సీజన్ కావడంతో ఈ బడ్జెట్లో కేటాయించిన పనులను వినాయక ఉత్సవాల పనుల కింద బిల్లులను చూపించి.. అందినంత దండుకునేందుకు పావులు కదిపారు. మాన్సూన్ సీజన్ పనులు చేస్తున్న కాంట్రాక్టరే ఈ వినాయక ఉత్సవాల పనుల టెండర్ దక్కించుకోవడంతో అవినీతిని అధికారులు సులువుగా మలచుకున్నారు. వచ్చే వారంలో ఈ బిల్లులు పెట్టి ఖజానాకు భారీ స్థాయిలో కన్నం వేయాలని భావించగా, వాళ్ల వ్యూహం బెడిసికొట్టింది.
నిధులు పక్కదారి..
ఒక్క మల్కాజిగిరి సర్కిల్లోనే కాదు జీహెచ్ఎంసీ పరిధిలోని ఇతర సర్కిళ్లలోనూ ఇదే రీతిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు లేకపోలేదు. వినాయక ఉత్సవాల సందర్భంగా చేపట్టిన పనులన్నింటిపై కమిషనర్ విచారణ జరిపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క పాట్‌హోల్స్ (రహదారుల గుంతల పూడ్చివేత) పనుల్లోనే కాదు ప్రతి చెరువులోనూ సుందరీకరణ, బేబీ పాండ్స్, లైట్ సిస్టం, జేసీబీ సామగ్రి పేరుతో నిధులు పక్కదారి పట్టించారని, కమిషనర్ ఆమ్రపాలి జోక్యం చేసుకొని విచారణకు ప్రత్యేక కమిటీ వేయాలని మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ డిమాండ్ చేశారు.