రంగారెడ్డి, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): జిల్లాలో ఈ నెల 5 నుంచి 9 వరకు నిర్వహించనున్న స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరం నుంచి ఆయన అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా స్థాయి అధికారులతో కలిసి స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమ నిర్వహణపై మండలాల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుద్ధ్ద్యం మెరుగుపర్చడం, గ్రీనరీని పెంచడమే లక్ష్యంగా జిల్లాలోని గ్రామాలు, పట్టణ ప్రాంతాలలో స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
ఆగస్టు 5న గ్రామాలు, పట్టణ వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని పౌరులతో కలిసి ప్రారంభించాలని సూచించారు. ఆగస్టు 6న తాగునీరు, వర్షపు నీటి సంరక్షణ, ఆగస్టు 7న కాలువలు, నీరు నిలిచిన ప్రాంతాలు, గుంతలను పూడ్చడం వంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఆగస్టు 8న ఆరోగ్యం, వీధి కుకల బెడదపై దృష్టి పెట్టాలని, ఆగస్టు 9న ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ స్థలాలను శుభ్రపర్చడం వంటి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. పెద్ద ఎత్తున మొకలు నాటాలని, ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాల్లో చనిపోయిన మొకలను తొలగించి వాటి స్థానంలో కొత్త మొకలు నాటి సంరక్షించాలన్నారు. అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు.
ప్రతి రోజూ ట్యాంకులను శుభ్రపర్చి క్లోరినేషన్ చేసి వ్యాధులు ప్రబలకుండా స్వచ్ఛమైన తాగునీటిని అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరు అధికారులు భాగస్వాములు కావాలన్నారు. గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, కార్యదర్శి, ఆశా కార్యకర్త, వీవోలతో కమిటీని ఏర్పాటు చేసుకుని నిర్దేశిత కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్పెషల్ ఆఫీసర్లు వారికి సబంధించిన మండలాలు, నియోజకవర్గల్లో వారి పరిధిలో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లను ఆకస్మికంగా సందర్శించి పరిశుభ్రత, తాగునీటి వసతి, వంట శాలలను పరిశీలించలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈవో కృష్ణా రెడ్డి, డీఆర్డీవో శ్రీలత, డీపీవో సురేశ్మోహన్, వైద్యాధికారి వెంకటేశ్వర్ రావు, ఎస్సీ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ రామారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.