రంగారెడ్డి, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య నెలకొనే ప్రాంతాలను గుర్తించి పరిషారానికి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రామ పంచాయతీల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగకుండా అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని.. సమ్మర్ యాక్షన్ ప్లాన్ను రూపొందించాలన్నారు. మిషన్ భగీరథ నీటి ట్యాంకులు, పైపులైన్లలో లీకేజీలుంటే గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు గ్రామాల్లో అందుబాటులో ఉండి ప్రస్తుతం పనిచేయని బోర్లు, పంపుసెట్లు, చెరువులు వంటి వాటిని ముందస్తుగా గుర్తించి వాటికి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు.
వచ్చే మూడు నెలలు అత్యంత కీలకమని.. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారు లు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఏఈలు ప్రతిరోజూ క్షేత్ర స్థాయిలో .. డీఈలు సంబంధిత మండలాల్లో ఉండాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు పని చేసే ప్రాంతాల్లో నీరు, మెడికల్ కిట్ వంటివి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని డీఆర్డీఏ పీడీని ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మొకలు ఎండిపోకుండా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ శ్రీలత, అదనపు పీడీ సుభాషిణి, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, ఇరిగేషన్ అధికారులు, ఎంపీడీవోలు, ఏఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.