వికారాబాద్, జూన్ 19 : కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులపై నారాయణపేట్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలన్నారు. మంజూరైన పనులకు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
రోడ్ల విస్తరణకు సంబంధించి పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ శాఖల ఇంజినీర్లు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. వివిధ కాలేజీల నిర్మాణం నిమిత్తం భూసేకరణ చేపట్టాలని, ఆ విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కొడంగల్‌లో నిర్మించే అతిథి గృహానికి సంబంధించి నమూనాను రూపొందించి టెండర్లు పిలవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల భవనాల నిర్మాణాల నమూనాలు, వైద్యుల నియామకానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.
గృహ జ్యోతి పథకం కింద దారిద్య్రరేఖకు దిగువనున్న పేద కుటుంబాలకు విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించే దిశగా పనిచేయాలన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణానికి అవసరమైన నిధుల నిమిత్తం ప్రతిపాదనలు పంపాలన్నారు. మంజూరైన చెక్ డ్యాంల పనులపై, అటవీ శాఖ భూముల్లో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. కొడంగల్ నియోజకవర్గానికి వసతి గృహాల నిర్మాణాలకై స్థల సేకరణ చేపట్టి వివిధ సంక్షేమ శాఖలకు కేటాయించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, తాండూరు ఆర్డీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తనను కలువడానికి వచ్చేవారు బొకేలు, శాలువాలకు బదులుగా పెన్నులు, పుస్తకాలు తేవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నోటు పుస్తకాలు, పెన్నులు ఇతర స్టేషనరీతో రావాలని కోరారు. అప్పుడే పేద విద్యార్థులకు సహాయం చేసినట్లు ఉంటుందని పేర్కొన్నారు.