వికారాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): జిల్లాలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్ లో కలెక్టర్ ప్రతీక్ జైన్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ద్వారా రూ.582.88 కోట్ల చెక్కును 5,933 స్వయం సహాయక సంఘాల సభ్యులకు కలెక్టర్ అందజేశారు. కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ స్నేహమెహ్రా, వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ జాతీయ జెండాలను ఎగురవేశారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. ఎందరో త్యాగధనుల పోరా ట ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని.. దేశప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అంబేద్కర్ సారథ్యంలో భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిందన్నారు. రాజ్యాం గం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం, లౌకికవాదం, న్యాయాన్ని హక్కు గా పొందుతున్నారన్నారు.

ప్రజాపాలన, పారదర్శకతతో సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అం దించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రగతిని వివరించారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చి.. ఇప్పటివరకు ఈ పథకం కింద జిల్లాలో 5.15 కోట్ల మంది మహిళలు ఉచిత రవాణా సదుపాయాన్ని వినియోగించుకున్నారన్నారు.
రైతుభరోసా పథకంలో 2,76,567 మంది రైతులకు రూ.361 కోట్ల ను రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందన్నారు. రుణమాఫీ పథకం కిం ద రూ.2 లక్షల్లోపు జిల్లాలో 1.35 లక్షల మం ది రైతుల రూ.849 కోట్ల రుణాలను మాఫీ చేశామని.. రైతు బీమా పథకంలో భాగంగా 2018 నుంచి ఇప్పటివరకు 7,346 మంది రైతులు మృతి చెందగా, వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.367 కోట్లను చెల్లించినట్లు వివరించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి జిల్లా నుంచి 2,65, 269 దరఖాస్తులురాగా, ఇప్పటివరకు 12,863 ఇండ్ల నిర్మాణానికి ఆమోదించినట్లు,
వివిధ దశల్లో జరుగుతున్న నిర్మాణాలకు రూ.120 కోట్ల చెల్లింపులు పూర్తి చేశారన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద జిల్లాలోని 19,888 కుటుంబాలకు రూ.12 వేల చొప్పుల చొప్పున రెండు విడతల్లో రూ.11.93 కోట్లను చెల్లింపులు పూర్తి చేసిందన్నారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగదారులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తుందని, జిల్లాలో 1,42,932 కుటుంబాలకుగాను ఇప్పటివరకు రూ.70.44 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం అందజేసిందన్నారు. పేద మహిళలకు సబ్సిడీ ద్వారా రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 1,19,735 మందికి లబ్ది చేకూరుతుందన్నారు.

జిల్లాలో కొత్తగా 43,589 రేషన్ కార్డులను మంజూరు చేశారన్నారు. మరోవైపు రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ప్రభుత్వ వైద్య సహాయ పరిమితిని రూ.10 లక్షలకు పెంచిందని, ఇప్పటివరకు 31,695 మంది పేదల చికిత్స పొందారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద 3200 మంది లబ్ధిదారులకు రూ.లక్షా116ల చొప్పున రూ. 32 కోట్లను అందజేసిందన్నారు.
మరోవైపు చేప పిల్లల పంపిణీలో భాగంగా 2025-26 సంవత్సరానికిగాను జిల్లాలోని 617 చెరువుల్లో 1.07 కోట్ల చేప పిల్లలను వంద శాతం సబ్సిడీతో వదలడం జరిగిందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 924 పాఠశాలల్లో రూ.18 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి చేశామన్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.800 కోట్లు మంజూరుకాగా, కొడంగల్‌లో మాత్రమే నిర్మాణం పురోగతిలో ఉందన్నారు.
రూ.197 కోట్లతో జిల్లాలోని హకీంపేట్‌లో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. హకీంపేట్‌లో రూ.వెటర్నరీ కాలేజీ నిర్మాణానికిగాను ప్రభుత్వం రూ.200 కోట్లను మంజూరు చేశారన్నారు. ముఖ్యమంత్రి ఓవర్సీస్ పథకంలో భాగంగా 2025-26 సంవత్సరంలో ఆరుగురు విద్యార్థులకు రూ.92 లక్షలను మంజూరు చేసిందన్నారు. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 12,856 మహిళ సంఘాలకు రూ.658 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేశారని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ స్నేహ మెహ్రా, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఇన్చార్జి అదనపు కలెక్టర్లు రాజేశ్వరీ, సుధీర్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.