వికారాబాద్, ఏప్రిల్ 1 : పోలింగ్ రోజు నిర్వహించే విధులు, ఈవీఎంల పనితీరుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణ రెడ్డి, అసెంబ్లీ లెవల్ మాస్టర్ ట్రైనర్స్, జిల్లా లెవల్ మాస్టర్ ట్రైనర్స్కు సూచించారు. సోమవారం కలెక్టరెట్ సమావేశం హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో పోలింగ్ విధుల నిర్వహణపై ట్రైనర్స్కు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యా ట్లను పోలింగ్ కేంద్రాల్లో అమర్చడం, మాక్ పోలింగ్ నిర్వహణపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
ప్రిసైడింగ్ అధికారుల హ్యాండ్ బుక్లో ఉన్న ప్రతి అంశంపై అవగాహన ఉండాలని, వాటిలో సూచించినట్లు పోలింగ్ సామగ్రిని సేకరించుకోవాలని తెలిపారు. నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రా రంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటింగ్ గోప్యత నిబంధనలపై అవగాహన పెంచుకోవాలన్నారు. చూపులేని దివ్యాంగ ఓటర్లు సహాయకుడితో ఓటు వేసేందుకు ఫామ్ 14-ఏ నిబంధనలను పాటించాలన్నా రు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, మీరందరూ వివరాలు ఇవ్వాలన్నారు.
ఈ నెల 2, 3 తేదీల్లో వికారాబాద్ నియోజకవర్గంలో బాయ్స్ జూనియర్ కళాశాల, పరిగి నియోజక వర్గంలో జిల్లా పరిషత్ బాయ్స్ స్కూల్లో పీవో, ఏపీవోలకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నెల 3, 4 తేదీల్లో తాండూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, కొడంగల్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శిక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సుధీర్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస రావు, ఎన్నికల విభాగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.