తాండూరు, నవంబర్ 20 : ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరు సహకరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి కోరారు. సోమవారం తాండూరు ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించి నియోజకవర్గంలోని ఎన్నికల బూత్‌ల వివరాలు, సిబ్బంది గురించి తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 9 లక్షల 60వేల మంది ఓటర్లు ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా 1133 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
23, 24వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగుల నుంచి ఓటింగ్ స్వీకరించనున్నట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటును వినియోగించుకోవాలన్నారు. ఎలక్షన్ సిబ్బందికి ఈవీఎంలపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని సూచించారు. రాజకీయ పార్టీల నేతలు ఎలక్షన్ నిబంధనలు పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ తారాసింగ్, డీఎస్పీ శేఖర్‌గౌడ్ ఉన్నారు.
వికారాబాద్ : ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు వారి విధులపై అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్‌లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూడాలని సూచించారు. కౌంటింగ్‌లో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించాలని అన్నారు. ఎన్నికల పరిశీలకుల ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరుగుతుందని, కౌంటింగ్ కేంద్రాన్ని పరిగి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను అక్కడే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపులో భాగంగా సిబ్బందికి ఓటింగ్ యంత్రాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ర్యాండమైజేషన్ తర్వాత కౌంటింగ్ సెంటర్లను కేటాయించడం జరుగుతుందని, కేటాయించిన కౌంటింగ్ సెంటర్‌కు సిబ్బంది అందరూ సకాలంలో హాజరుకావాలని, దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఒకరోజు ముందుగానే చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చక్రపాణి, డీపీవో తరుణ్‌కుమార్, భూగర్భ జల వనరుల శాఖ అధికారి దీపారెడ్డి పాల్గొన్నారు.