రంగారెడ్డి, జూలై 1( నమస్తే తెలంగాణ) : వనస్థలిపురం ఏరియా దవాఖాన, వెల్నెస్ సెంటర్కు నెల రోజుల్లో మళ్లీ వస్తా.. అక్కడి సమస్య లన్నీ పరిష్కారం కావాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి వైద్యాధి కారులను ఆదేశించారు. వనస్థలిపురం వెల్నెస్ సెంటర్లో మందుల్లేవ్.. అన్న శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన వార్త కథనానికి ఆయన స్పందించారు. మంగళవారం ఆయన ఏరియా దవాఖానను పరిశీలించి.. అందుతున్న సేవల గురించి రోగులు, వారి సహాయకులను అడిగి తెలుసుకున్నారు. అలాగే దవాఖానలోని అన్ని వార్డులను కలియదిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వైద్యం అందించడంలో రాజీపడొద్దని అక్కడి వైద్యాధికారులకు సూచించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన నిధులు కేటాయిస్తానని చెప్పారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు. సర్కార్ దవాఖానలకు వచ్చే వారంతా పేదలని.. వారిని మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచాలన్నారు. ఓపీ సేవలు, ఆక్సిజన్, ఆరోగ్యశ్రీ సేవలను మరింత మెరుగుపరచాలన్నారు. ఆస్పత్రుల పరిసరాల్లో పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలని..సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుధ్యం, మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే గ్రామాల్లో జ్వర బాధితుల సర్వే నిర్వహించి వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక వైద్యం అందించాలన్నారు. కలెక్టర్ వెంట మహేశ్వరం వైద్యాధికారి నాగేందర్ , వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యాధికారులు ఉన్నారు.