హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ శాఖలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. గత పదేండ్లపాటు ప్రధాన రంగాలకు మించి ప్రగతి సాధించిన ఈ శాఖలు ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో నిధుల్లేక పడకేశాయి. ఉద్యాన శాఖలో రెండేండ్లుగా కొత్త పథకాలు అమలు కాకపోవడంతో కూరగాయల సాగును వదిలేస్తున్నారు. డ్రిప్, స్పింకర్లకు ఇవ్వాల్సిన సబ్సిడీలు రూ.930 కోట్ల మేరకు పేరుకుపోయినట్టు సమాచారం. ప్రభుత్వం ఉద్యాన రైతులను పట్టించుకోవడం లేదని, కేవలం కేంద్ర పథకాలను మాత్రమే అందజేస్తున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రధానమైన పాడి పరిశ్రమకు బీఆర్ఎస్ హయాంలో ఇతోధికంగా ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు బర్రెలు, ఆవులు, గొర్రెల పంపిణీ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేశారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లీటర్కు రూ.4 చొప్పున పాడి రైతులకు ఇచ్చే ఇన్సెంటివ్ నిలిచిపోయింది. ప్రస్తుతం పాడి రైతులకు ప్రభుత్వం దాదాపు రూ.5 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. గొర్రెలు, బర్రెలు, ఆవుల పంపిణీ పథకాల ఉసే లేకుండా పోయింది. శిశు సంక్షేమ శాఖకు పాలను సరఫరా చేసిన విజయ డెయిరీకి రూ.50 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.
బీఆర్ఎస్ హయాంలో ఎగుమతుల్లో ముందున్న మత్స్యశాఖ కాంగ్రెస్ పాలనలో దారుణంగా వెనుకబడింది. లబ్ధిదారులకు ఈ శాఖ చెల్లించాల్సిన బకాయిలు రూ.190 కోట్ల మేరకు పెండింగ్లో ఉన్నాయి. గతంలో ఏటా చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ గత రెండేండ్ల నుంచి నిధుల్లేక తూతూమంత్రంగా సాగుతున్నది. చేప పిల్లలు పంపిణీ చేసిన ఏజెన్సీలు తమ బిల్లుల కోసం కోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్రస్తుతం కేంద్రం నుంచి వచ్చే వాటా నిధులతోనే రాష్ట్ర మత్స్యశాఖ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టు తెలుస్తున్నది.