మంచిర్యాల, మార్చి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లాలో గోదావరి పక్కనే ఉన్నా సీతారాంపల్లి, తాళ్లపల్లి రైతులు సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్‌లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు దిగువన ఉన్న సుందిళ్ల బరాజ్‌లో నీళ్లు ఆపితే.. మంచిర్యాల గోదావరి నిండుకండులా ఉండేది. దీంతో సీతారాంపల్లి, తాళ్లపల్లి గ్రామాల్లో దాదాపు వందల ఎకరాలకు సాగునీరు అందేది. ఎక్కడో మేడిగడ్డ కుంగిందని సుందిళ్లలోనూ నీళ్లను ఆపకుండా దిగువకు వదిలేస్తుండటంతో రెండేండ్లుగా మంచిర్యాల జిల్లాలోని గోదావరిలో నీరు లేకుండా పోయింది. దీంతో ఎల్లంపల్లి నుంచి పాయలా వచ్చే కొద్దిపాటి నీటిని ఒడిసిపట్టి పంటలను కాడుకునేందుకు రైతులు నడుం కట్టారు.
ఎల్లంపల్లి నుంచి పాయలా వచ్చే గోదావరిలో ఓ చోట ఆగే నీటిని తమ పొలాలకు తరలించుకునేందుకు దాదాపు కిలోమీటరున్నర సొంత డబ్బులతో కాలువ తవ్వుకున్నారు. 40 మంది రైతులు ఎకరానికి రూ.1,500 చొప్పున జమ చేసి.. రూ.2 లక్షలతో జేసీబీ సాయంతో గోదావరిలో కాలువ తవ్వించారు. ఆ కాలువ గుండా వచ్చే నీటిలో మోటర్లు వేసి గోదావరి గట్టు పక్కనున్న కొద్దిపాటి ఎకరాల్లోని తమ పొలాలకు మళ్లించుకుంటున్నారు. ఎంతో శ్రమకోర్చి కాలువ తవ్వుకున్నామని, ఎండలు ముదిరితే ఈ మాత్రం నీళ్లు రావని.. పంట పొట్టదశకు వచ్చాక నీళ్లు రాకపోతే ఏమవుతుందోనంటూ ఆందోళన చెందుతున్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్/ సిర్పూర్ (యూ), మార్చి 15: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ) మండలం రాఘాపూర్ చెరువు అడుగంటిపోయింది. వర్షాకాలంలో నిండే ఈ చెరువు నీటిని యాసంగి పంటకే ఉపయోగిస్తారు. వర్షాకాలంలో చెరువు నీటిని ఉపయోగించరు. ఈ ఏడాది ఈ ప్రాంతంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక చెరువులోకి నీరు రాలేదు. ఏటా యాసంగికి వెయ్యి ఎకరాలు సాగు చేసిన రైతులు ఈ సారి 200 ఎకరాల్లోనే పంటలు వేశారు. అవి కూడా ఆరు తడి పంటలే అయినా.. నీళ్లు అందక పశువులకు గ్రాసంగా వదిలేశారు. గతంలో ఎండాకాలంలోనూ నిండుకుండలా ఉండే రాఘాపూర్ చెరువులో నీరు లేక ఈ సారి సాగు చేయలేకపోయామని రైతులు వాపోతున్నారు.