Coaching Centres | హనుమకొండ చౌరస్తా: పోలీస్ కోచింగ్ పేరుతో కొన్ని అనధికార, ప్రైవేట్ అకాడమీలు నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని భారీగా డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి. శిక్షణ పొందేందుకు వచ్చే నిరుద్యోగులకు నకిలీ అకాడమీలు గాలం వేస్తున్నాయి. సరైన వసతులు, నిపుణులైన ఫ్యాకల్టీ లేకుండా ప్రకటనలు గుప్పిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారీ ప్రకటనలు ఇచ్చి నిరుద్యోగులను ఆకర్షించి వేల రూపాయాలు వసూలు చేస్తున్నాయి. నగరంలో అనేక అకాడమీలు పోలీస్ కోచింగ్ పేరిట అధికంగా ఫీజులు వసూల్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. హనుమకొండ కిషన్‌పుర, నయీంనగర్లు నకిలీ కోచింగ్ సెంటర్లకు కేంద్రంగా మారాయి. కనీస నిబంధనలు, ఎలాంటి అర్హత లేకుండా అకాడమీలను నిర్వహిస్తున్నారు.
రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ల ద్వారా నిర్వహించాల్సిన అకాడమీ సెంటర్లు పోలీస్ యూనిఫాం వేసి డ్యూటీలో ఉంటున్నవారే ఉచిత సేవ చేయకుండా డబ్బులు తీసుకుని మరీ కోచింగ్ సెంటర్లు నడిపించడంపై మండిపడుతున్నారు. నాణ్యతలేని బోధన, అనుభవంలేని అధ్యాపకులతో నామమాత్రపు తరగతులు నిర్వహిస్తూ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వంద శాతం ఉద్యోగం ఇస్తామంటూ నకిలీ వాగ్దానాలు చేయడం, తప్పుడు హామీలు ఇచ్చి అకాడమీలు నిరుద్యోగుల నుంచి సొమ్ము చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 7 వేల పోస్టులతో పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వడంతో అకాడమీ నిర్వాహకుల పంట పండినట్లుగా భావిస్తున్నారు. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఊరి నుంచి నగరానికి వస్తున్న నిరుద్యోగులు అకాడమీల పేరుతో మోసం చేసే కేసుల నిర్వాహకుల వలలో పడుతున్నారు. పలువురు నిర్వాహకులపై పోలీస్స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఎలాంటి అర్హతలేని వారు అకాడమీలతో నిరుద్యోగుల నుంచి ఫీజుల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నగరంలోని పలు అకాడమీల నిర్వాహకులు వివిధ కేసుల్లో ఇరుక్కుని కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఎలాంటి నిబంధనలు పాటించకుండా ‘క్యాష్’ చేసుకుంటున్నారు. అనుభవనం లేని ఫ్యాకల్టీ, రిమూవల్ ఫర్ సర్వీస్ అయిన పోలీస్ అకాడమీ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని, కిషన్‌పురలో ఉన్న ఆయన దుకాణం వరంగల్‌కు మార్చినట్లు సమాచారం. మంచి అధికారుల వద్ద శిక్షణ తీసుకుని పోలీస్ ఉద్యోగం కొట్టాలనే తపనతో వచ్చిన నిరుద్యోగులు మోసపోతున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్ల బారినపడి మోసపోతున్నారు. ప్రభుత్వం లేదా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకోవడం మంచిదని పలువురు కోరుతున్నారు.
ఓ అకాడమీ పేరుతో పోలీసులు శిక్షణ పేరుతో దందా నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. విధుల్లో ఉంటూ ఉచితంగా శిక్షణ ఇవ్వాల్సిన పోలీసులు హనుమకొండ కిషన్‌పురలో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. పోలీసు డ్రెస్ వేసుకుని చదువు చెప్పొద్దని నిబంధనలు ఉన్నా శిక్షణ ఇస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పోలీస్ డ్రెస్, గన్లతో కోచింగ్ ఇస్తున్నా టాస్క్‌ఫోర్స్ పోలీసులు అటువైపు కన్నెత్తిచూడటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గన్నులు పట్టుకుని క్లాసులు చెప్పడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. నగరానికి వచ్చి అవగాహన లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అకాడమీల్లో చేరి మోసపోవద్దని, ఆలోచించి అడుగేయాలని నిరుద్యోగులకు పోలీసు అధికారులు సూచిస్తున్నారు.