హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పీఎం కుసుమ్ సోలార్ ప్లాంట్లు ఏర్పాట్లు చేసేందుకు ఎంపికైన రైతుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టగా మారింది. తొలుత లాభాలొస్తాయని ఆశచూపి డిపాజిట్లుగా రైతుల నుంచి డబ్బులు కట్టించుకున్నారు. నోడల్ ఏజెన్సీగా అంతా తామే చూసుకుంటామని భరోసా ఇచ్చారు. చివరికి చేతులెత్తేశారు. సర్కార్ కదా అని నమ్మితే నట్టేట ముంచే పరిస్థితి దాపురించింది. ఇప్పుడు ఆ రైతులు త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్లాంట్ల ఏర్పాటుకు బ్యాంకులు రుణాలివ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ముందే లక్షలు పెట్టుబడి పెట్టిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ ప్లాంట్లు నెలకొల్పేందుకు కేంద్ర పునరుద్పాదక ఇంధన వనరుల మంత్రిత్వశాఖ మార్చి 31న గడువుగా నిర్ణయించింది. అంటే ఇక రోజులు మాత్రమే మిగిలాయి. అంతలోపు పూర్తిచేయకపోతే పవర్ పర్చేంజ్ అగ్రిమెంట్లు రద్దవుతాయి. గడువు ముగియనున్న నేపథ్యంలో రుణాలు మంజూరైనా.. లబ్ధిదారులకు అందజేసేందుకు బ్యాంక్‌లు తర్జనభర్జన పడుతున్నాయి. రుణంగా అందించే మొత్తాన్ని విడుదల చేయడమే లేదు. దీంతో రైతులు అటు బ్యాంకుల చుట్టూ, ఇటు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసిగి వేసారిపోతున్నారు.
పీఎం కుసుమ్ పథకంలో రాష్ట్రంలో 1,450 మోగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతినిచ్చింది. దీనికోసం అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ఫీజు రూపంలో రూ.11 వేలు, ఈఎండీ రూపంలో ఒక మెగావాట్‌కు లక్ష+ జీఎస్టీ (రెండు లక్షలకు పైగా) నగదు చెల్లించారు. బ్యాంక్ లింకేజీ విషయంలో అనేక ఇబ్బందులొస్తున్నాయి. ఒక్కో రైతుకు రూ.25 లక్షల అదనపు భారం పడుతున్నది. పైగా బ్యాంక్‌లు రుణాలివ్వడమే లేదు. నోడల్ ఏజెన్సీ అయిన టీజీ రెడ్కో పట్టించుకోవడం లేదు. ఈ దశలో కనీసం బ్యాంకర్లు, రైతులతో ఒక్క అవగాహన సమావేశాన్ని కూడా రెడ్కో ఏర్పాటు చేయలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్లాంట్ల కోసం తీసుకొన్న స్థలాలను నాలా కన్వర్షన్ చేశారు. దీంతో ఆయా రైతులకు ఆ భూముల నుంచి రైతు భరోసా కూడా రావడంలేదు. దీంతో లాభాలు వచ్చేనా? అన్న అనుమానాలు రైతులను పట్టిపీడిస్తున్నాయి. ఈ రంగంలోకి అనవసరంగా ప్రవేశించామని రైతులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పథకం గడువును ఈ ఏడాది డిసెంబర్ వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని టీజీ రెడ్కో వీసీ, ఎండీ అనీల తెలిపారు.
బడాబాబులకు ప్రయోజనం చేకూర్చేందుకే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారు. రైతులను బ్యాంకులు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. సిబిల్ స్కోర్, ఆస్తులను ష్యూరిటీగా అడుగుతున్నారు. పీఎం కుసుమ్ స్కీం నిబంధనలు సడలించాలి. ఇతర రాష్ర్టాల సోలార్ ఇంటిగ్రేటర్లు వచ్చి తక్కువకు ప్లాంట్లు పెడతామని ఆశ చూపుతున్నారు. తక్కువ ధరవి అంటగడితే నాణ్యతలేమి ఉపకరణాలను అంటగట్టబోతున్నారు. దీంట్లో రైతులకు తీరని నష్టం కలగనున్నది. అధికారులు తక్షణమే రైతులు, బ్యాంకర్లు, సోలార్ ఇంటిగ్రేటర్లతో సమావేశం ఏర్పాటుచేసి సమస్యలు పరిష్కరించి, అనుమానాలను నివృత్తి చేయాలి.