NEET aspirant : నీట్ పరీక్ష మరో విద్యార్థిని ప్రాణం తీసింది. పరీక్షకు సంబంధించిన ఒత్తిడి తట్టుకోలేక ఉత్తరాఖండ్‌కు చెందిన 23 ఏళ్ల రియా కుమారి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్, డెహ్రడూన్ పరిధి, చంద్రబాని ప్రాంతానికి చెందిన రియా కుమారి కొంతకాలంగా నీట్ పరీక్ష కోసం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆమె తన ఇంటిలోనే ఆత్మహత్యకు పాల్పడింది.
మంగళవారం ఉదయం రియా కుమారి తన గదిలోంచి బయటకు రాలేదు. ఎంత పిలిచినా పలకలేదు. దీంతో ఆమె తల్లి, తండ్రి కలిసి గది తలుపు బద్దలు కొట్టారు. లోపల ఉరి వేసుకుని మరణించిన రియా కుమారి కనిపించింది. దీంతో ఉదయం 11.30 గంటలకు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని రియా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె గదిలోంచి ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆ నోట్లో అమ్మా, నాన్నా తనను క్షమించాలంటూ వేడుకుంది. తను భారంగా మారడం ఇష్టం లేదని, ఇందులో ఎవరి తప్పూ లేదని, తానే పోటీ పడలేకపోతున్నానని లేఖలో పేర్కొంది. తను ఆత్మహత్య చేసుకోవడమే దీనికి పరిష్కారం అని, క్షమించాలని లేఖలో వివరించింది. ఐలవ్ యూ.. ఐయామ్ సారీ అంటూ లేఖను ముగించింది.
ఇక, రియా తండ్రి ఆర్మీలో పని చేసి రిటైరయ్యారు. రియా ఇంటర్లో 96.7 శాతం స్కోర్‌తో టాపర్‌గా నిలిచింది. కొంతకాలంగా అక్కడి ఒక కాలేజీలో నీట్ కోసం ప్రిపేరవుతోంది. ఈ క్రమంలోనే రియా ఆత్మహత్యకు పాల్పడింది. గత నెలలో జరిగిన నీట్ పరీక్ష రద్దైన సంగతి తెలిసిందే. పేపర్ లీకేజీ కారణంగా ఈ పరీక్ష రద్దైంది. రీ ఎగ్జామ్ ఈ నెల 21, ఆదివారం నాడు జరగనుంది. పరీక్షకు కొద్ది రోజుల ముందు రియా ఆత్మహత్యకు పాల్పడింది.