తాండూరు, మార్చి 9 : యాలాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలోని దావులాపూర్లో రైస్‌మిల్లు నిర్మాణ పనులు పూర్తైనా అందులో యంత్రాలను అమర్చకుం డా రూ. 54 లక్షల నిధులు దుర్వినియోగం చేసిన అంశంలో విచారణ జరిపిన డీఎల్సీవోతోపాటు అదనపు కలెక్టర్ రాజేశ్వరి నిధులను రికవరీ చేయాలని ప్రతిపాదిస్తూ కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. దీంతో సోమవారం వికారాబాద్ కలెక్టర్ దీపక్‌తివారీ కాంట్రాక్టర్ నుంచి నిధులను రికవరీ చేయాలని ఆదేశాలిచ్చారు.
రైస్‌మిల్లులో యంత్రాలు ఏర్పాటు చేయకుండానే నిధులు దుర్వినియోగం చేసిన విషయమై తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కలెక్టర్‌కు సోమవారం మరోసారి ఫిర్యా దు చేశారు. డీఎల్సీవో, అదనపు కలెక్టర్ నివేదికను నెల రోజులకు పైగా తొక్కిపెట్టిన అధికారులు రోహిత్‌రెడ్డి ఫిర్యాదుతో స్పందించి నిధుల రికవరీకి ఆదేశించారు. పల్లా ఇన్‌ప్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట ఈ నిధులను మూడు చెక్‌ల ద్వారా అక్రమంగా డ్రా చేశారు. 2-08-2024న రూ. 18,69,350, 26-12-2025న రూ. 17,00,000 27-12- 2023న రూ. 17,71,650లను మూడు చెక్‌ల ద్వారా డ్రా చేశారు.
దావులాపూర్ రైస్ మిల్లులో యంత్రాల ఏర్పాటుకు మంజూరు చేసిన రూ. 54 లక్షలను కాంట్రాక్టర్ ఈ మి ల్లులో ఏర్పాటు చేయకుండానే బషీరాబాద్(నవాంద్గి) పీఏసీఎస్‌లో ఏర్పాటు చేసిన యం త్రాల ఫొటోలను బోగస్ బిల్లులతో ఎంబీ రికార్డులు చేయించి రూ. 54 లక్షలను పక్కదారి పట్టించినట్లు గతంలోనూ మాజీ ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ యాలాల మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన ఆదేశాలతో జిల్లా కో-ఆపరేటివ్ అధికారి రాంచందర్‌రావు విచారణ జరిపారు. నెల రోజుల కిందట అదనపు కలెక్టర్ రాజేశ్వరి కూడా విచారణ జరపగా నిధులు దుర్వినియోగం అయినట్లు నిర్ధారించారు. ఆ నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు.