కాలుష్య కారక ఫార్మా కంపెనీలకు తాము భూములు ఇచ్చేదే లేదని గత ఎనిమిది నెలలుగా స్పష్టం చేస్తున్నా.. ప్రభుత్వం పదేపదే ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుండడంతో విసిగిపోయిన రైతులు అధికారులపై తిరగబడ్డారు. సోమవా రం లగచర్ల గ్రామానికి వచ్చిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్‌ప్రసాద్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, కొడంగల్ తహసీల్దార్ విజయ్‌కుమార్.. గ్రామస్తులతో మాట్లాడుతున్న సందర్భంలో తాము భూములు ఇచ్చేది లేదని ఇప్పటికే స్పష్టం చేసినా..మళ్లీ మళ్లీ ఎందుకు మీటింగ్‌లు పెడుతున్నారనే ఆగ్రహంతో వాగ్వాదానికి దిగి.. తమ భూములు పోతాయనే ఆవేదనతో వారిపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. జీవనాధారమైన భూములను ప్రభుత్వం తీసుకుంటే మేము ఎలా బతకాలని, మాకు వలసలే దిక్కు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తమ భూముల్లో ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి తాము నిద్రలేని రాత్రులను గడుపుతున్నామని.. తమ భూముల్లో కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలు వద్దే.. వద్దు అంటూ ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, ఆందోళనలు చేపట్టినా సర్కారుకు పట్టడంలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని దుద్యాల మండలంలోని హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంటతండా పరిధుల్లో సుమారు 1,375 ఎకరాల్లో ఫార్మావిలేజ్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుండగా..భూములు కోల్పోతున్న రైతులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకి స్తున్నారు. మా ప్రాణాలు పోయినా సరే భూములు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. కాంగ్రెస్ సర్కారు పోలీస్ బలగాలతో వారి పోరాటాన్ని అణచాలని చూస్తుంటే రోజురోజుకూ ఉధృతమవుతున్నది.
– పరిగి, నవంబర్ 11
ఫార్మా విలేజ్‌కు తాము భూములు ఇవ్వబోమని హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంటతండాలకు రైతులు మొదట తహసీల్దార్ నుంచి కలెక్టర్, ప్రభుత్వ పెద్దలకు వినతిపత్రాలను సమర్పించారు. తమ భూముల్లో ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం వారి విజ్ఞప్తులను పట్టించుకోకుండా ఫార్మా కంపెనీల ఏర్పాటుకు యత్నించడం, భూముల సేకరణకు చర్యలు చేపట్టంతో రైతులు గత ఎనిమిది నెలలుగా నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఆందోళనలను తీవ్ర స్థాయిలో చేపడుతున్నారు. వారి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అక్టోబర్ 9న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పోలేపల్లి నుంచి దుద్యాల వరకు శాంతియుతంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించగా.. కాంగ్రెస్ సర్కారు పోలీసులతో ముందస్తు అరెస్టులు చేసి అడ్డుకున్నది. పాదయాత్ర కోసం వెళ్లిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదే అంశంపై అక్టోబర్ 25న లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామసభ ఏర్పాటు చేయగా రోటిబండతండా మీదుగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ దుద్యాల మండలాధ్యక్షుడు శేఖర్‌ను రైతులు అడ్డుకొని, తమ పంట పొలాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటు ప్రతిపాదనను నువ్వే ముందుకు తీసుకుపోతున్నావంటూ అతడిని నిలదీశారు. వారికి నచ్చజెప్పాల్సిన సదరు నేత తన అధికార దర్పాన్ని ప్రదర్శించడంతో గిరిజన రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా తండాలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ హఠాత్పరిణామంతో అతడు గజగజ వణికిపోయాడు. పోలీసుల రక్షణలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో తలదాచుకున్నాడు. అప్పటికీ ఆగ్రహం చల్లారని రైతులు, మహిళలు, యువకులు జీపీ గదిని చుట్టుముట్టారు. పక్కనే ఉన్న హైమాస్ట్ లైట్ స్తంభంతో గది తలుపులు బద్దలుకొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో పోలీసులు రైతులపై లాఠీచార్జ్ చేసి అక్కడి నుంచి చెదరగొట్టారు. తమ భూములను కాలుష్య కారక కంపెనీలకు ఇవ్వబోమని స్పష్టం చేశారు.
భూసేకరణకు మళ్లీ, మళ్లీ రావొద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు. తాజాగా సోమవారం ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం అధికారులు లగచర్ల గ్రామానికి దూ రంగా హకీంపేట, దుద్యాల మధ్య వేదికను ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేయగా కలెక్టర్ ప్రతీక్‌జైన్, కడా ప్రత్యేకాధికారి తదితరులు లగచర్ల గ్రామానికెళ్లి రైతులతో మాట్లాడుతుండగా.. తాము భూములివ్వబోమని తెగేసి చెప్పినా మళ్లీమళ్లీ గ్రామసభలు ఏర్పాటు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసి అధికారులపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దాడిలో పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఘటనా ప్రాంతంలో పోలీసు బలగాలను మోహరించారు. అనంతరం ఐజీ సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ కార్యాలయానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కలెక్టర్‌పై దాడి జరగడంతో అధికారులు విధులు బహిష్కరించి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కలెక్టర్‌పై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయడంతోపాటు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదిలావుండగా కాలుష్య కారక కంపెనీల ఏర్పాటును రైతులు అడ్డుకుంటుండగా ప్రభుత్వం వినకుండా ముందుకెళ్లడం సరికాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.