షాద్నగర్, అక్టోబర్ 11 : షాద్నగర్ అంటే తనకు ప్రత్యేక అభిమానం అంటూ స్వయంగా ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పనులపై మాత్రం పెదవి విప్పలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి సారిగా షాద్నగర్ నియోజకవర్గంలో అధికారికంగా సీఎం రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. కచ్చితంగా నియోజకవర్గంపై హామీల వర్షం కురిపిస్తారు… అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని గంపెడు ఆశలు పెట్టుకున్న నియోజకవర్గ ప్రజలకు నిరాశే మిగిలింది. కానీ ఎప్పటి లాగే ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేస్త్తూ సీఎం ప్రసంగం విమర్శలు… తమ పార్టీకి సంబంధించిన గొప్పలతోనే సరిపోయింది. సీఎం రేవంత్రెడ్డి నియోజకవర్గానికి వరాలు ప్రకటిస్తారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తారని భావించిన సామాన్య ప్రజలు సీఎం ప్రసంగం విని పెదవి విరిచారు. శుక్రవారం షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు.
ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఆవశ్యకత, విద్యార్థుల ప్రయోజనాలు, విద్యా ప్రమాణాల వంటి అంశాలపై మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి అధిక ప్రాధాన్యతను మాత్రం ప్రతిపక్ష పార్టీ నాయకులు, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు, మరో నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్లపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం ప్రసంగానికి మునుపు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్నగర్ నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన నిధులు, పనుల వివరాలను సీఎంకు సభా ముఖంగా వివరించారు. షాద్నగర్ ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు, చౌదరిగూడ మండల కేంద్రంలో మండల పరిషత్ భవనం, పోలీస్ స్టేషన్ భవనం, ప్రభుత్వ దవాఖాన ఏర్పాటు, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణం వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్రెడ్డి ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో రాణిస్తున్నానని ఎమ్మెల్యే ప్రస్తావించారు. అయినప్పటికీ సీఎం రేవంత్రెడ్డి ఎమ్మెల్యే సూచించిన అభివృద్ధి పనులపై స్పష్టత ఇవ్వలేదు. షాద్నగర్ అభివృద్ధికి సభా ముఖంగా ఎలాంటి వరాలు, హామీలు ఇవ్వలేదు. ఎమ్మెల్యే ప్రస్తావించిన అభివృద్ధి పనుల చిట్టా చాలా పెద్దగా ఉన్నదని, ఇంటికి వెళ్లి చదువుతానని చెప్పారే తప్ప హామీలపై ఎలాంటి స్పష్టత లేకపోవడంపై పలు విధాలుగా ప్రజలు చర్చించుకున్నారు. ఇలా సీఎం పర్యటనపై స్థానికుల ఆశలు అడియాశలు అయ్యాయని పలువురు వాపోయారు. ఇదిలా ఉంటే సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచే ఎమ్మార్పీఎస్ నాయకులు, పలువురు రైతులను ముందస్తుగా అరెస్ట్ చేసి చౌదరిగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. ముందస్తు అరెస్టులపై ఎమ్మార్పీఎస్ నాయకులు మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అక్రమ అరెస్ట్లు సరికాదని, మాదిగల ఏబీసీడీ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తే అరెస్ట్లకు పాల్పడడం దేనికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.