రంగారెడ్డి, నవంబరు 25(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ధరణిని తీసుకొచ్చి రైతు నమ్ముకున్న భూమికి భద్రత కల్పించారు. ధరణి రాకముందు వరకు రాత్రికి రాత్రి తన భూమి ఎవరి పేరు మీదకు మారుతుందోనన్న భయంతో బతికిన రైతులు ధరణి వచ్చాక గుండె మీద చేయి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడంతో భూమియే సర్వస్వంగా భావిస్తున్న రైతన్నలు కలవరపాటుకు గురవుతున్నారు.
కౌలు చట్టాన్ని తెచ్చి రైతుకు కౌలుదారుకు మధ్య ఒప్పందం చేయిస్తామని కాంగ్రెస్సోళ్లు చెబుతుండడం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనేక రూపాల్లో నష్టాలను చవి చూడాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తన యాజమాన్య హక్కుకే ఎసరు వస్తుందనే భయంతో ఏ ఒక్క రైతు కూడా తనకున్న భూమిని కౌలుకు ఇచ్చేందుకు ముందుకు రాక కౌలుదారుల బతుకులు ఆగమాగం అయ్యే పరిస్థితి రానుంది.
ఉపాధి దొరకక వారి కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కౌలు చట్టాన్ని తెచ్చి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు సాయానికి సైతం ఎగనామం పెట్టే ప్రమాదం ఉన్నదని పలువురు హెచ్చరిస్తున్నారు. ‘ధరణి’ని తీసేసి ‘భూ మాత’ పోర్టల్‌ను తెచ్చి పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నదని జిల్లా రైతాంగం ఆందోళన చెందుతున్నది. కాంగ్రెస్ చెబుతున్నట్లు జరిగితే భూ సమస్యల కథ మళ్లీ మొదటికి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని, ధరణి పోర్టల్‌ను కొనసాగించాలని రైతాంగం కోరుకుంటున్నది.
కాంగ్రెస్ హయాంలో పాత పద్ధతి ఉండేది. పట్వారీలు ఇండ్లది అండ్లకు.. రాయడం ఎవరి భూమి ఏ సర్వే నంబర్లో ఉందో తెల్వకపోయేది. పహాణీల్లో రాస్తూ కొట్టేయడం వల్ల ఎవరికి ఎంతుందో అర్థం కాకపోయేది. అప్పుడు భూమి అమ్ముదామన్నా, కొందామన్నా పెద్ద బాధ ఉండె. ధరణి వచ్చాక కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చిండ్రు. అప్పుడు పాణం నిమ్మలమైంది. అయినా గిప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు. బీఆర్ఎస్ పార్టీకే మద్దతు తెలుపుతం. కారుగుర్తుకే ఓటు వేస్తం.
– బండారు మల్లేశ్, దేవునిఎర్రవల్లి గ్రామం (చేవెళ్ల రూరల్)
‘ధరణి’ని రద్దు చేస్తే మళ్లీ దళారులదే రాజ్యమొస్తది. ధరణి వచ్చినంకనే భూముల రికార్డులు భద్రంగా ఉన్నయ్. పాత పద్ధతిలో పట్వారీలు పహాణీల్లో ఇష్టమొచ్చినట్లు పేర్లు మార్చేటోళ్లు. సరిచేసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ‘ధరణి’ రాకముందు భూ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు తిప్పలయ్యేది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాగానే పాసు పుస్తకాలు ఇస్తుండ్రు. గెలువని కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మము. సీఎం కేసీఆర్ వెంటే ఉంటం. మా కుటుంబమంతా కారుగుర్తుకే ఓటు వేస్తం.
– కాళ్ల వినోద్ కుమార్, అస్మత్పూర్ (మంచాల)
‘ధరణి’తో భూములకు భద్రత ఉంటుంది. ఇదివరకు పట్వారీ దగ్గర పహాణీ, ఎమ్మార్వో ఆఫీసుల రికార్డులు.. పహాణీలో ఒకతీరుగా, తహసీల్దార్ ఆఫీసుల ఒకతీరుగా రాసి ఉండేది. భూముల లెక్కలు ఆగమాగం ఉండేది. ఇదంతా సక్కగ చేసుకోవాలంటే దళారుల పెత్తనం సాగేది. కాంగ్రెసోళ్లు రైతులు, కౌలుదారులకు మధ్య విభేదాలు తీసుకురావాలని కుట్రలు చేస్తుండ్రు. ‘ధరణి’ వచ్చాకే భూములకు భద్రత, రైతులకు భరోసా ఏర్పడింది. అటువంటి బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీకి ఎలా అధికారం ఇస్తం. కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలె.
– సేవ్యానాయక్, (కడ్తాల్)
ధరణిని తీసేస్తే మళ్లీ రైతులు కష్టాల పాలవుతరు. పట్టాల కోసం పట్వారీ, గిర్ధావరి, తహసీల్దార్ కార్యాలయాలంటూ చెప్పులరిగేలా తిరగాల్సి వస్తది. అధికారులై ఎప్పుడొస్తరో.. తెల్వని పరిస్థితి నెలకొంటది. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్‌ను అధికారంలోకి రానివ్వం. ఒకరి భూమి ఇంకొక్కరి పేరుమీద ఎక్కించి పంచాయితీలు పెట్టి పైసలు గుంజుతరు. ధరణి వచ్చాక ఇబ్బందులు తప్పాయి. అరగంటలోనే పట్టా మార్పిడి, పాసుపుస్తకాలు చేతికొస్తున్నయ్. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయం. మళ్లీ మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. మేమంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం.
– జంతుక కిరణ్, (ఆమనగల్లు మున్సిపాలిటీ)
ధరణి పోర్టల్ ఉండాల్సిందే. ఎనకటికి భూములు అమ్మెటోళ్లకు, కొనెటోళ్లకు మస్తు తిప్పలుండే. ఆఫీసుల చుట్టూ తిరిగేది. మ్యూటేషన్ కోసం ఎమ్మార్వో ఆఫీస్ కాడా తవుసు తీసేది. ఎవ్వరివి వాళ్లకు ఒప్పజెప్పితే గాని పని కాకపోయేది. ‘ధరణి’ వచ్చాకే భూమి రిజిస్ట్రేషన్, ఎమైనా సవరణలు సులువుగా అవుతున్నయ్. మీసేవలో బుక్ చేసుకుని ఎమ్మార్వో ఆఫీసుకు పోతే నిమిషాల వ్యవధిలోనే పని అయిపోతున్నది. మాయదారి కాంగ్రెస్ అధికారంలోకి రాదుపోదు.. రైతులను పట్టించుకునే బీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు. సీఎం కేసీఆర్ వెంటే ఉంటం. ఏదిఏమైనా కారుగుర్తుకు గుద్దుడే. మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చుడే.
– కొష్క జంగయ్య, కొంగరకలాన్(ఆదిబట్ల)
కౌలుదారు చట్టం తీసుకొస్తే మళ్లీ వీఆర్వోల చేతివాటం మళ్లొస్తది. రైతులు, కౌలుదారులకు గొడవలు షురూ అయితయి. కాస్తులో ఒకరి పేరు.. పట్టా ఒకరి పేరు తీరుమారు చేసి డబ్బులు దండుకుంటరు. ఇలాంటి పొరపాట్ల వల్ల దళారులకు మళ్లీ సంపాదించుకునే అవకాశం ఏర్పడుతుంది. కాంగ్రెస్ పాలనలో పహాణీ పద్ధతి గందరగోళంగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో మధ్యవర్తుల పేరు తొలిగించి నేరుగా భూ యజమానికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చింది. రైతు వేలి ముద్ర వేస్తేనే భూమి బదిలీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎలాగూ గెలువదు.. వాళ్ల మాటలు మేం నమ్మం. సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం.
– చలీచీమల సతీష్. (ఆమనగల్లు)
పాతకాలం మాదిరి పట్వారీ వ్యవస్థను అందుబాటులోకి తెస్తే రైతులకు తీరని అన్యాయం జరుగుతది. కౌలుదారు, అనుభవదారు అనే కాలాలు మళ్లీ పెట్టడం సరికాదు. ఇప్పటికే వీఆర్వోలు చేసిన తప్పిదాలతో రెవెన్యూ వ్యవస్థలో ఎన్నో సమస్యలు తలెత్తాయి. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు సర్కారు ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. భూమాత పోర్టల్ అంటూ మాయమాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు.. సచ్చేది లేదు.. వాళ్ల మాటలు నమ్మం. సీఎం కేసీఆర్‌కే మా మద్దతు. కారుగుర్తుకే మా ఓటు.
– కాశమల్ల రాములు, చౌదర్పల్లి (యాచారం)
‘ధరణి’ని తీసేస్తే కౌలుదారు చట్టం తీసుకొస్తామని కాంగ్రెసోళ్లు చెబుతుండ్రు. పాత పద్ధతి మళ్లీ తీసుకొస్తే రైతులకు అవస్థలే. దరిద్రమైన పట్వారీల వ్యవస్థ వస్తే రైతులకు తెల్వకుండానే రికార్డులు తారుమారైతయ్. అప్పట్లో రైతులు భూముల రికార్డులను సరి చేసుకోవడానికి తిప్పలు పడుతుండెటోళ్లు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ‘ధరణి’ తీసుకొచ్చాకే భూములకు భద్రత ఏర్పడింది. ఇంత మంచి ధరణి పోర్టల్‌ను ఎలా తీసేస్తారు.. అధికారంలోకి రాని కాంగ్రెస్ పార్టీ ఏడికొస్తే ఆడికి ప్రగల్భాలు పలుకడమేనా.. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తది. మేమంతా కారుగుర్తుకే ఓటు వేస్తం.
– బార్లపల్లి సత్యనారాయణ రెడ్డి, కౌకుంట్ల గ్రామం (చేవెళ్ల రూరల్)