సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఆస్తిపన్ను సొమ్ము జీహెచ్ఎంసీ ఖజానాకు చేరకుండా తన సొంతానికి వాడుకున్న సిటిజన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) కంప్యూటర్ ఆపరేటర్ సుభాషిణిపై ఇటీవల వేటు వేసిన బల్దియా కమిషనర్ కర్ణన్.. మరో ఇద్దరు అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. చందానగర్ సర్కిల్ కార్యాలయంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సుమారు 700కు పైగా సూపర్ స్ట్రక్చర్ల నుంచి రూ.56 లక్షల మేర నగదు రూపంలో ఆస్తిపన్ను వసూలు కాగా.. ఈ నగదును బ్యాంకు ద్వారా బల్దియా ఖజానాకు జమ చేయకుండా కొందరు సొంతంగా వినియోగించుకున్నారు.
ఆడిట్లో ఈ విషయం వెలుగులోకి రావడంతో కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన కంప్యూటర్ ఆపరేటర్పై వేటు వేయడంతో పాటు నెలల తరబడి ఈ తంతు జరుగుతున్నా గుర్తించడంలో సంబంధిత డీసీ (ఉప కమిషనర్), చీఫ్ అకౌంట్ ఎగ్జామినర్ల నిర్లక్ష్యం ఉందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు ఈ ఇద్దరిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని కమిషనర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.