కడ్తాల్, ఆగస్టు 29 : సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని సీఐ గంగాధర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటుకు బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ ప్రియరమేశ్నాయక్ రూ.20 వేల విరాళాన్ని శుక్రవారం పోలీస్స్టేషన్లో సీఐకి అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని తెలిపారు.
నేరస్థులను పట్టుకోవడానికి సీసీ కెమెరాల ముఖ్యపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో దొంగతనాలను, అసాంఘిక కార్యకలాపాలను, నేరాలను అదుపు చేయవచ్చన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని కోరారు. అనంతరం విరాళం అందించిన మాజీ ఎంపీటీసీని పోలీసులు శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వరప్రసాద్, కానిస్టేబుల్ రాంకోటి పాల్గొన్నారు.