వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 29: రాష్ట్రంలో అకాల వర్షాలు ,ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మిర్చిలో (Chilli Farming) తగు సస్యరక్షణ చర్యలు చేపడితే, అధిక దిగుబడులు పొందవచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఎం.వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఇటీవల రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తుండడంతో మిర్చితో పాటు ఇతర పంటలు అపార నష్టాలకు గురైతున్నాయని, వాటిలో సస్యరక్షణ చర్యలు చేపడితే, అధిక దిగుబడులు పొందవచ్చని ఆయన సూచించారు. ప్రధానంగా మిర్చిలో ఆకు ముడత, వెర్రి తెగులు, మవ్వకుళ్లు తెగుళ్లు ఆశిస్తున్నాయని, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పూత పిందె రాలిపోతుందని, ఆకు ముడుత ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. మిర్చిలో ఆకుముడిత తెగులు జెమిని వైరస్ వల్ల వస్తుందని, ఇది పంట తొలి దశ నుంచి కోత వరకు ఎప్పటికైనా ఆశించవచ్చని తెలిపారు.
పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు, రాత్రి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ తెగులు వ్యాపిస్తుందన్నారు. ఎక్కువగా ఆకు ముడత లేత ఆకుల పైన వైరస్ సోకిన మొక్కల ఆకులు చిన్నవిగా మారి ముడుచుకొని పోయి పడవ ఆకారంలో కనిపిస్తాయని చెప్పారు. ఆకుల ఈనెలు ఆకుపచ్చగా ఉంటూ, ఈనెల మధ్య భాగం లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకు ముడత తెగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు తెల్ల దోమ వలన వ్యాపిస్తుంది.
నివారణ..
ప్రస్తుతం విత్తన శుద్ధి చేసే వారికి కిలో విత్తనానికి ఇమిడా క్లోరిఫ్రెడ్ 6 మిల్లి లీటర్లు. పంట నాటిన 20 రోజుల నుంచి వేప నూనె 1500 పీపీఎం 5 మిల్లీ గ్రాములు లీటర్ నీటిలో కలిపి పది రోజుల ఒకసారి పిచికారి చేయాలని ఆయన సూచించారు. పొలం చుట్టూ జొన్న మొక్కల్ని 2-3 వరుసలు కంచెప్పంటగా పెంచితే పక్క పొలం నుంచి వ్యాపించే రసం పీల్చే పురుగులు అరికట్టవచ్చు అన్నారు. నత్రజని భాస్వరం పొటాష్ చెరువులను సిఫారసు చేసిన మోతాదులో పిచికారీ చేయాలన్నారు గట్ల మీద వైరస్ మొక్కలను స్థావరాలుగా ఉన్న కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు నిర్మూలించాలన్నారు. పంట మార్పిడి పద్ధతులు పాటించాలి అన్నారు. ప్రస్తుతం పంట పరిస్థితిని సమీపంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులను సంప్రదించి తగు మోతాదు మందులను పిచికారి చేయాలని సూచించారు.