వికారాబాద్ : జిల్లాలోని ధరూర్ మండలం గట్టేపల్లిలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ( Metuku Anand ) , బీఆర్ఎస్ నాయకులు బుధవారం సందర్శించారు. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యాన్ని వారు పరిశీలించారు .

మొలకెత్తిన వడ్లతో రోడ్డుపై నాట్లు వేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి నెల రోజులు దాటినా ఇప్పటివరకు కొనుగోళ్లు పూర్తి చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 శాతం కొనుగోలు పూర్తి చేశామని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి ( Chief Minister ) వాస్తవ పరిస్థితి గమనించాలని సూచించారు.
ధరూర్ మండల కేంద్రంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా కొనలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్, డీసీవో , సివిల్ సప్లై అధికారులతో ఆయన మాట్లాడారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ గట్టేపల్లి, ధరూర్ టౌన్, నాగారం, మోమిన్ కలాన్, తరిగోపుల తదితర గ్రామాలను సందర్శించి రైతుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.