Chevella | షాబాద్, జూన్ 5 : రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ అన్నారు. గురువారం షాబాద్ మండలంలోని కేశారం, సోలీపేట్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. కేశారంలో సదస్సులో పాల్గొన్న ఆర్డీవో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చేవెళ్ల డివిజన్లో అన్ని మండలాల్లోని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందన్నారు. రైతులు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఏండీ అన్వర్, డిప్యూటీ తహసీల్దార్ మధు, మాజీ సర్పంచులు చల్లా సంధ్య, బోరాంచ రమ్య, నాయకులు చల్లా శ్రీరాంరెడ్డి, రాంచంద్రారెడ్డి, రాంరెడ్డి, సూర్యప్రకాశ్, నగేశ్, సిబ్బంది తదితరులున్నారు.