షాబాద్, జనవరి 23: సంక్షేమ పథకాలు అందించడంలో పేదవారికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం షాబాద్ మండల కేంద్రంలో రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల పంపిణీ పథకాలపై నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తుందన్నారు.
కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతుభరోసా వంటి పథకాలు అర్హులకు అందజేస్తామన్నారు. అదే విధంగా మండలంలోని రుద్రారం, చందనవెల్లి, నాగరకుంట, బొబ్బిలిగామ, లక్ష్మారావుగూడ, గొల్లూరుగూడ, కుమ్మరిగూడ, కొమరబండ, కుర్వగూడ, చర్లగూడ, సర్దార్‌నగర్ గ్రామాల్లో అధికారులు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించారు.
అనంతరం ఆయా గ్రామాలకు సంబంధించిన కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతుభరోసా తదితర పథకాలకు సంబంధించిన వివరాలను అధికారులు గ్రామసభలో చదివి ప్రజలకు వినిపించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్‌రెడ్డి, ఎంపీడీవో అపర్ణ, తహసీల్దార్ కృష్ణయ్య, డిప్యూటీ తహసీల్దార్, మధు, ఎంపీవో శ్రీనివాస్, వ్యవసాయాధికారి వెంకటేశం, ఏపీవో వీరాసింగ్, ఏపీఎం నర్సింహులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అక్తర్‌పాషా, మాజీ సర్పంచ్ తమ్మలి రవీందర్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆమనగల్లు : ప్రభుత్వం ప్రజలకు అందజేసే సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగే ప్రక్రియ అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లిలో గురువారం గ్రామ సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు, రైతు ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు వంటి పథకాల జాబితాల్లో పేర్లు లేవని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందిస్తామని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ యాట గీత నర్సింహ, మున్సిపల్ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కమిషనర్ వసంత, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్ సుజాత, కేఎన్ఆర్ సేవా దళం అధ్యక్షుడు బాబా, నాయకులు వెంకట్‌రెడ్డి, పర్వతాలు, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, లక్ష్మారెడ్డి, జగన్, శంకర్, రవీందర్, శ్రీధర్, తిరుమలేశ్, లింగం, కృష్ణ, డేవిడ్, సుధాకార్, యాదిరెడ్డి పాల్గొన్నారు.
కడ్తాల్ : అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని మైసిగండిలో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలు నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, ఏఎంసీ చైర్పర్సన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, డైరెక్టర్ నరశ్నాయక్, మాజీ సర్పంచ్‌లు తులసీరాంనాయక్, శేఖర్‌గౌడ్, మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీలత, సీఐ శివప్రసాద్, ఆర్ఐలు వాహీద్, నాయకులు పాల్గొన్నారు.
నందిగామ : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మండలంలోని చేగూరు, అంతిరెడ్డిగూడ గ్రామాల్లో నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభల్లో ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, మాజీ ఎంపీటీసీలు చంద్రపాల్‌రెడ్డి, కృష్ణ, కుమారస్వామిగౌడ్, తహసీల్దార్ రాజేశ్వర్, ఎంపీడీవో సుమతి, ఏవో వాని, నాయకులు నర్సింహ, కృష్ణ, శ్రీశైలం, బుచ్చయ్య, భాస్కర్, రాజశేఖర్, వెంకట్ పాల్గొన్నారు.
మొయినాబాద్ : మండల పరిధిలోని అజీజ్‌నగర్‌లో తహసీల్దార్ గౌతంకుమార్, చిలుకూరు గ్రామంలో ఎంపీడీవో సంధ్య, కేతిరెడ్డిపల్లి గ్రామంలో పశువైద్యాధికారి వెంకట్‌యాదవ్, ఎతుబార్పల్లి గ్రామంలో డిప్యూటీ తహసీల్దార్ వినోద్‌కుమార్, కుత్బుద్దీన్‌గూడలో ఏఈ సూర్యనారాయణ, నాగిరెడ్డిగూడలో పీఆర్ ఏఈ ఆశా జ్యోతి, పెద్దమంగళారం, ఎల్కగూడలో ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ ఇమ్రాన్ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టుకున్న వారి పేర్ల జాబితాను చదవి వినిపించారు.
దరఖాస్తు పెట్టుకుంటే తమ పేర్లు ఎందుకు రాలేదని కొందరు నిలదీశారు. పెద్దమంగళారం గ్రామంలో ఓ కాంగ్రెస్ నేత లేచి ప్రజలకు సమాధానం చెబుతున్న క్రమంలో కారు ఉంటే రేషన్ కార్డు రాకపోయేదని చెబుతుండగా ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రేషర్ కార్డు కోసం దరఖాస్తులు పెట్టుకున్న ప్రతి ఒక్కరికీ అందిస్తామని చెప్పి ఓట్లు వేసుకున్నారు.. ఇప్పుడు ప్రజలను మోసం చేశారని అధికారులు, కాంగ్రెస్ నేతలను నిలదీశారు. రేషన్ కార్డులు.. ఇండ్లు వస్తాయనే నమ్మకం లేదని ప్రజలు గ్రామ సభల్లో ఆందోళన వ్యక్తం చేశారు.
పెద్దఅంబర్‌పేట : మున్సిపాలిటీపాలిటీ పరిధి తట్టిఅన్నారంలో గురువారం నిర్వహించిన గ్రామసభలో మా పేరు రాలేదని స్థానికులు ప్రశ్నించారు. 18వ వార్డుకు సంబంధించి పలు పథకాల కోసం తట్టిఅన్నారంలోని వార్డు కార్యాలయంలో స్థానికుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా చదివిన జాబితాలో మా పేర్లు ఎందుకు రాలేదని పలువురు అరవడంతో గందరగోళం నెలకొన్నది. జాబితాలో పేర్లు లేనివారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు.
షాద్‌నగర్‌టౌన్ : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని కౌన్సిలర్ విశాల, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వం అన్నారు. పట్టణంలోని 23వ వార్డులో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది రమేశ్, ప్రియాంక, భాస్కర్, రాము, హరీశ్‌రాజ్, నాయకులు శ్రీధర్, సురేశ్ పాల్గొన్నారు.
కడ్తాల్ : గ్రామసభలతో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్ మండిపడ్డారు. గురువారం మండల పరిధిలోని గాన్గుమార్లతండాలో నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులకే ప్రభుత్వ పథకాలు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు హంస్యమోత్యానాయక్, భీక్యానాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ సేవ్యానాయక్, మాజీ ఉప సర్పంచ్ పాండునాయక్, తండావాసులు పాల్గొన్నారు.
అబ్దుల్లాపూర్‌మెట్ : మండల పరిధిలోని మజీద్‌పూర్, బాటసిగారం, ఇనాంగూడ, చిన్నరావిరాల గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డుల జారీ పథకాలకు ఎంపికైన లబ్ధిదారుల పేర్లను అధికారులు చదివి వినిపించారు. అధికారులు ఎంపిక చేసిన లబ్దిదారుల జాబితా సక్రమంగా లేదని, అనర్హుల పేర్లు వచ్చాయని ప్రజలు అధికారులను నిదీశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీవాణి, ఎంపీవో మధుసూదనచారి, సీడీపీవో రేణుక, పంచాయతీరాజ్ ఏఈ ఇంద్రసేనారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు రజనీకాంత్‌రెడ్డి, రాంబాబు, రాఘవేందర్, ప్రేమలత, మాజీ ప్రజాప్రతినిధులు సుధాకర్‌రెడ్డి, లతశ్రీగౌరీశంకర్, యశోద, వెంకటేశ్, మేడిపల్లి బాలమ్మ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు : కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ ఆమనగల్లు మున్సిపాలిటీ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్ అన్నారు. ఆమనగల్లు పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ విషయాలను ప్రశ్నించే నాయకులపై కేసులు పెట్టడమే ఒక పనిగా పెట్టుకుందని అన్నారు. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇచ్చిన హమీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు రఘు, సాయిలు, యాదయ్య నాయకులు వెంకటేశ్, భాస్కర్, శివకుమార్, యాదయ్య, సైదులు, నాగిళ్ల జగన్, గణేశ్, శ్రీరాములు, మహేశ్ నేత, శివ, గణేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మంచాల : మండల పరిధిలోని ఎల్లమ్మతండా, చీదేడు, దాద్‌పల్లి, మంచాల, ఆగపల్లి తదితర గ్రామాల్లో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో రేషన్‌కార్డులు, రైతు ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు వాటిపై అర్హులైన వారి జాబితాను గ్రామ సభలో చదివి వినిపించారు. గ్రామ సభల్లో లబ్ధిదారుల పేర్లు రాకపోవడంతో అధికారులను ప్రశ్నించారు. కార్యక్రమంలో సహకార సంఘం డైరెక్టర్ జెనిగ వెంకటేశ్, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
చేవెళ్ల రూరల్ : శంకర్పల్లి మండల పరిధిలోని గ్రామాల్లో మూడో రోజూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామ సభల్లో గందరగోళం చోటుచేసుకున్నది. గురువారం చందిప్ప గ్రామ సభలో ఉదయం 11 గంటల వరకు ఏ ఒక్క అధికారి కూడా హాజరు కాకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. దీంతో కొంతమంది వెనుదిరిగిపోయారు. అలాగే మోకిలా గ్రామ సభలో జాబితాలోని పేర్లను చదవడంలో తడబడిన పంచాయతీ కార్యదర్శిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం చోటు చేసుకున్నది. దీంతో ఎంపీడీవో వెంకయ్య జోక్యం చేసుకొని ప్రజలకు సర్ది చెప్పారు.