Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం, మార్చి 9 : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత రోడ్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్‌గూడ నుంచి రాచులూరు వరకు సింగిల్‌రోడ్డుగా ఉన్న ఈ రోడ్డును రెండు వరుసల రోడ్డుగా విస్తరించటం కోసం సీఆర్ఐఎఫ్ నిధులు రూ.30 కోట్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి విడుదల చేయించారు. చర్లపటేల్‌గూడ, తుర్కగూడ, కప్పాడు, ఎలిమినేడు, జబ్బార్‌గూడ, తిమ్మాపూర్ గ్రామాల మీదుగా రాచులూరు వరకు ఈ రోడ్డును విస్తరిస్తే ఈ గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయన్న ఆయా గ్రామీణ ప్రాంతాల ప్రజల సూచన మేరకు ఈ నిధులు విడుదల చేయించారు. ఎన్నికల సమయం నాటిని ఈ నిధులు విడుదలై సిద్దంగా ఉన్నప్పటికి రోడ్డు పనులు చేపట్టంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
గత నాలుగురోజులుగా ప్రారంభమైన ఈ రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో తుర్కగూడ, కప్పాడు, చర్లపటేల్‌గూడ, ఎలిమినేడు, జబ్బార్‌గూడ, తిమ్మాపూర్ గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవాణా సౌకర్యం సులభతరంగా మారటంతో పాటు ఈ రోడ్డు పనులు పూర్తయితే త్వరగా ఇబ్రహీంపట్నం చేరుకునే వీలుంటుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడచూసినా గత ప్రభుత్వం చేపట్టిన రోడ్ల పనులు తప్పా… ప్రస్తుతం ప్రభుత్వం రోడ్ల పనులతో పాటు, ఏఒక్క అభివృద్ధి పనిని కూడా పట్టించుకోవటం లేదని ఆయా గ్రామీణ ప్రాంతాల ప్రజలు తెలుపుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరువతో ఈ రోడ్డు పనులకు నిధులు విడుదలయ్యాయి. చర్లపటేల్‌గూడ నుంచి రాచులూరు వరకు రోడ్డును విస్తరించటం కోసం నిధులు కేటాయించటంతో ప్రస్తుతం ఈ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ రోడ్డు విస్తరణకు కృషిచేసిన మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఏనుగు భరత్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ తుర్కగూడ
ఈ రోడ్డు పనులు పూర్తయితే ప్రయాణం సులభతరంగా మారనుంది. గత ప్రభుత్వ హాయాంలో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో రోడ్ల విస్తరణకు కోట్లాది రూపాయల నిదులు కేటాయించారు. కాని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులకు ఎక్కడకూడా తట్టెడు మట్టి పోయలేదు. ప్రస్తుత ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో మంజూరైన నిధుల ద్వారానే శిలఫలకలు వేసుకుని కాలం వెల్లదీస్తున్నారు. కాని, అభివృద్ధి పనులకు నిధులు విడుల చేయించటంలేదు. నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలోనే కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరిగాయి.
నిట్టు జగదీశ్వర్, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు