వికారాబాద్, ఏప్రిల్ 18 : వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోని కాలనీలో వరుసగా చోరీలు జరుగుతుండడం తో స్థానికులు విడతల వారీగా గస్తీ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొన్నది. వికారాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో చోరీలు జరుగుతుండడం పోలీసులకు సవాల్‌గా మా రింది. తాళం వేసిన ఇండ్లు, జన సాంద్రత లేని ప్రాంతా లు, విద్యుత్ సరఫరా లేని ప్రదేశాలు, రైలు పట్టాల సమీపంలో ఉన్న శివారు ప్రాంతాలను దొంగలు దోచేస్తున్నారు.
పట్టణంలోని ఆలంపల్లి (ఎంఐజీ) రాఘవేంద్రస్వామి కాలనీలో చెడ్డీ గ్యాంగ్ చోరీలకు పాల్పడుతున్నది. గత నెల రోజుల్లో 10 కిపైగా చోరీలు జరుగగా బంగారం, వెండి, నగదు తస్కరణకు గురైంది. పట్టణంలోని మణికంఠనగర్ కాలనీ రైలు పట్టాలకు సమీపంలో ఉండడంతోపాటు కాలనీలో వీధిదీపాలు వెలగక పోవడంతో చోరీలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 7న ఒకే రోజు రెండు ఇండ్లలో చోరీలు జరుగగా దొంగలు బంగారం, వెండి, డబ్బును ఎత్తుకెళ్లారు.
అదేవిధంగా మరుసటి రోజు మరో ఇంట్లో దొంగలు పడడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయంలో నిద్రించాలంటేనే భయంగా ఉందని పేర్కొంటున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్నా..పదికి పైగా పోలీసుల ఇండ్లు ఉన్నా తమ కాలనీలో చోరీలు జరుగుతున్నాయని పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరాణా షాపులో సెల్‌ఫోన్ చోరీ జరగడంతోపాటు ఇంటి ముందు నిలిపిన బైకుల నుంచి పెట్రోల్‌ను తస్కరిస్తున్నారని.. పోలీసులు సక్రమంగా గస్తీ నిర్వహించకపోవడంతోనే తమ కాలనీలో చోరీలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.
దొంగతనాలను నివారించేందుకు గత పదిరోజులుగా విడతల వారీగా కాలనీవాసులం గస్తీ కాస్తున్నామని పేర్కొంటున్నారు. రాత్రి 11 గంటల వరకు మహిళలు ఇంటి బయట కాపాలాగా ఉంటుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ డ్యూటీలు చేసి వచ్చిన పురుషులు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జాము 4 గంటల వరకు కర్రలు పట్టుకొని కాలనీలో తిరుగుతూ గస్తీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి తమ కాలనీలోని స్తంభాలకు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
బావమరిది కుమార్తె తలానీలను సమర్పించేందుకు ఈనెల 7న తిరుపతికి కుటుంబంతో కలిసి వెళ్లా. మరుసటి రోజు మా కాలనీ నుంచి ఫోన్ వచ్చింది. మీ ఇంట్లో దొంగలు పడ్డారని.. ఇంటికి వెళ్లి చూడగా తాళం, బీరువాను దొంగలు పగులగొట్టి.. 8 తులాల బంగారం, 6 తులాల వెండి, రూ.40,000 దొం గలు ఎత్తుకెళ్లారు. చోరీలను అరికట్టేందుకు పోలీసులు గస్తీని పెంచాలి.
-యాదయ్య మణికంఠ నగర్ కాలనీ, వికారాబాద్
తమ కాలనీలో దాదాపు 40 ఇండ్లు ఉంటాయి. కలెక్టరేట్‌కు, ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంటుంది. దాదాపుగా 90 శాతం ఉద్యోగులే ఉన్నారు. అందులో పదివరకు పోలీసు కుటుంబాలే ఉన్నాయి. రాత్రి సమయంలో నిద్రించాలంటే భయంగా ఉన్నది. దొంగలు వస్తారేమో అనే భయంతో ప్రతిరోజూ రాత్రి సమయంలో విడతల వారీగా గస్తీ నిర్వహిస్తున్నాం. ఉదయం డ్యూటీలు చేస్తూ.. రాత్రిళ్లు గస్తీ నిర్వహిస్తుండడంతో నిద్రలేక చాలా ఇబ్బంది పడుతున్నాం.
-రవీందర్‌గౌడ్, మణికంఠనగర్, వికారాబాద్
తమ కాలనీ రైలు పట్టాలకు సమీపంలో ఉండడంతోపాటు పలు చోట్ల వీధి దీపాలు వెలగకపోవడంతో దొంగతనాలకు అనువుగా మారింది. కాలనీలో నిత్యం చోరీలు జరుగుతుండడంతో భయం భయంగా బతుకుతున్నాం. పోలీసులు సక్రమంగా గస్తీ నిర్వహించకపోవడంతో కాలనీవాసులందరం విడతల వారీగా రాత్రి సమయంలో కర్రలు పట్టుకొని గస్తీ నిర్వహిస్తున్నాం. అనుమాస్పద వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. కాలనీలో పోలీసులు గస్తీ పెంచితే బాగుంటుంది.
-సత్యం, మణికంఠనగర్, వికారాబాద్
మా చెల్లి వివాహం కోసం 14 తులా ల బంగారాన్ని దాచి పెట్టా. ఏప్రిల్ 7న పుట్టింటికెళ్లి మరుసటి రోజు ఇంటికొచ్చి చూసే సరికి ఇంటి తాళా లు పగులగొట్టి ఉన్నాయి. లోపలికెళ్లి చూడగా బీరువాలో ఉన్న 14 తులా ల బంగారం కనిపించ లేదు. ఇంటికి తాళం వేస్తే దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రి సమయం లో నిద్రించాలంటేనే భయంగా ఉన్నది. పోలీసులు గస్తీ పెంచి చోరీలు జరుగకుండా చూడాలి.
-భవాని, మణికంఠనగర్, వికారాబాద్