Vikarabad | పూడూరు, జూలై 5 : బాసర ట్రిపుల్ ఐటీకి పూడూరు మండలం చనుగోముల్ హైస్కూల్ విద్యార్థినులు ఇద్దరూ ఎంపికైనట్లు హెచ్ఎం హనుమంత్ రెడ్డి పేర్కొన్నారు. పూడూరు మండల పరిధిలోని చనుగోముల్ హైస్కూల్లో వడ్ల అక్షర, సారా బేగంలకు ఉత్తమ మార్కులు రావడంతో వారిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ ఇద్దరు విద్యార్థినులు పదవ తరగతి ఫలితాల్లో కూడా జిల్లాలో ప్రథమ ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. చనుగోములు గ్రామానికి చెందిన ఒకే పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థినులు ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హెచ్ఎం హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థినులు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నప్పుడు ఉపాధ్యాయులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సైతం వీరిని ఆదర్శంగా తీసుకొని చదువుపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. ఉత్తమ మార్కులు సాధించి ట్రిపుల్ ఐటీలో సీటు పొందిన ఇద్దరు విద్యార్థులను వారు అభినందించారు.