వికారాబాద్, నవంబర్ 11: ఆసరా పింఛన్ల పెంపు కోసం ఈ నెల 26న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని క్లబ్ ఫంక్షన్ హాల్లో వికా రాబాద్ జిల్లా సదస్సు జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్ అధ్యక్షతన నిర్వ హించారు. సమావేశానికి జంగయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే దివ్యాంగులకు రూ.ఆరువేలు, వృద్ధులు, వితంతువులకు ఒంటరి మహిళలకు, చేనేత, గీత, బీడీ కార్మికులకు రూ. నాలుగువేలు పింఛన్ పెంచుతామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఆసరా పింఛన్‌దారులను మర్చిపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రంలో దివ్యాంగులు, వృద్ధుల వితంతుల పింఛన్ పెంచితే తెలంగాణలో పెంచకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఆసరా పింఛన్ పెంచి ప్రతినెలా ఒకటో తేదీనే ఇంటింటికీ వెళ్లి ఇస్తుంటే.. తెలంగాణలో మాత్రం నెలాఖరు దాటినా పింఛన్ రావడం లేదంటే ఆసరా పింఛన్ దారుల మీద కాంగ్రెస్ సర్కార్‌కు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. ఆసరా పింఛన్ దారులకు అండగా ఉండి పోరాటాన్ని ముందుకు తీసుకెళుతున్న ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగ అన్నారు. పింఛన్లు పెంచకపోతే కాంగ్రెస్ ప్రభు త్వంపై తాడోపేడో తెలుసుకోవడం కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటిం చారని గుర్తు చేశారు. నవంబర్ ఒకటి నుంచి 16 వరకు అన్ని జిల్లాల సదస్సులు నిర్వహించి, 17 నుంచి 23 వరకు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని సూచించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే లక్షలాది మందితో నవంబర్ 26న చలో హైదరాబాద్ చేపట్టి తీరుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు జర్నమ్మ, నాయకుడు రాజు పాల్గొన్నారు.