Chain Snatching | కులకచర్ల, ఏప్రిల్ 6 : చైన్ స్నాచర్లు చెలరేగిపోతున్నారు. మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్లి.. భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం ఇప్పాయిపల్లి గ్రామంలో ఈ ఉదయం చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది.
ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన ఎముకంటి నరసమ్మ తన ఇంట్లో ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఆమెను బెదిరించి.. మెడలో ఉన్న బంగారం పుస్తెలతాడును లాక్కెళ్లారు. వారిని ఎదుర్కొనే క్రమంలో బాధిత మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను 108 అంబులెన్స్‌లో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రెండున్నర తులాల బంగారం గొలుసును లాక్కెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.