వికారాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) ; పేద కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. గత మూడేళ్లుగా కేంద్రం జిల్లాలో దాదాపు 50 లక్షల పనిదినాలను తగ్గించి ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా బంద్ చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపాధి హామీ కూలీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. ప్రతి ఏటా వేసవిలో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలకు అదనపు కూలీ డబ్బులను కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తూ వస్తున్నది. మండే ఎండలోనూ ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న దృష్ట్యా అదనంగా కూలీ డబ్బులను పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి నెల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉపాధి హామీ కూలీలకు అందజేసే వేతనాన్ని ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మే నెలల్లో 30 శాతం అదనంగా చెల్లిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి మాసం ముగుస్తున్నా ఇప్పటివరకు ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదు. రెండేళ్లుగా అదనపు కూలీడబ్బుల ప్రకటనకు ఫిబ్రవరిని పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఉపాధి హామీ కూలీలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
ఇప్పటివరకు 59.71 లక్షల పనిదినాలు కల్పన
ఈ ఆర్థిక సంవత్సరం 67.37 లక్షల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఇప్పటివరకు 59.71 లక్షల పని దినాలను మాత్రమే జిల్లా యంత్రాంగం కల్పించింది. ప్రస్తుతం జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలకు రోజుకు రూ.300 కూలీ డబ్బులను అందజేస్తున్నారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులకు హాజరయ్యే కూలీలకుగాను ఇప్పటివరకు రూ.142.28 కోట్ల చెల్లింపులను పూర్తి చేశారు. మరోవైపు జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతల నిర్మాణం, నీటి ఊట గుంతల నిర్మాణం, మట్టి రోడ్ల నిర్మాణం పనులను ప్రధానంగా చేస్తున్నారు. అసైన్డ్ భూముల్లోని రాళ్లను తీసివేయడం, భూమిని చదునుచేయడం, బౌండ్రీలు ఏర్పాటు చేయడం, ఎరువు గుంతల నిర్మాణం, బోరుబావి తవ్వించడం తదితర పనులు చేపట్టనున్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మట్టి కట్టలు, నీటి ఊట గుంతలు, పశువులకు షెడ్ల ఏర్పాటు, భూ ఉపరితల నీటి గుంతల నిర్మాణం, పంట కాలువల మరమ్మతులు, పంట మార్పిడి కల్లాలు, కొత్త సేద్యపు బావులు తవ్వడం, నిరవధిక సమతల కందకాలు, ఖండిత సమతల కందకాలు, కొండ దిగువ ప్రాంతాల్లో నీటి నిల్వ కందకాలు, పశువుల నిరోధక కందకాలు, భూసార సంరక్ష కందకాలు, కొత్త పంట కాలువల నిర్మాణం, మైనర్ ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత, చేపల ఉత్పత్తి కుంటల నిర్మాణం, వరద కట్టల నిర్మాణం పనులను చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2,00,372 ఉపాధి హామీ కుటుంబాలుండగా.. 4,38,398 మంది కూలీలున్నారు.
3756 కుటుంబాలకే వంద రోజుల పని
ప్రతి ఏటా ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిని కల్పించడం పోయి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఈ ఆర్థిక సంవత్సరం వేల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఆర్థిక సంవత్సరంలో కనీసం 10 శాతం మేర కుటుంబాలకు కూడా పనిని కల్పించలేకపోయారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 30 రోజులే గడువున్నా ఇప్పటివరకు కేవలం 3756 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పనిని కల్పించారు. రెండేళ్ల క్రితం వరకు జిల్లాలో ప్రతి ఏటా 20 వేలకుపైగా కుటుంబాలకు వంద రోజులపాటు పనులను కల్పించగా, గత రెండేళ్లుగా వంద రోజుల పని పొందే కూలీల సంఖ్య మూడు వేలకు తగ్గిపోవడం గమనార్హం. జిల్లాలోని కొడంగల్, నవాబుపేట, మర్పల్లి, వికారాబాద్, దోమ, మర్పల్లి, పెద్దేముల్, మోమిన్‌పేట్, కోట్‌పల్లి, ధారూరు, కులకచర్ల మండలాల్లో మాత్రమే 100 కుటుంబాలకుపైగా వంద రోజులపాటు పనిని కల్పించగా, మిగతా 7 మండలాల్లో సింగిల్, డబుల్ డిజిట్‌లోనే కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు. తాండూరు మండలంలో అత్యల్పంగా కేవలం 19 కుటుంబాలకు., బషీరాబాద్‌లో 28, దౌల్తాబాద్‌లో 37, బొంరాస్‌పేట్‌లో 51, యాలాలలో 58, పూడూరులో 71, బంట్వారం మండలంలో 88 కుటుంబాలకు వంద రోజుల పనిని కల్పించారు.