కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. గత నాలుగేండ్లుగా ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలను తీసుకువచ్చింది. ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్‌పరం చేస్తూ వస్తున్నది మోదీ ప్రభుత్వం. కరువును అధిగమించడమే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా నిరుపేదల కడుపు నింపేందుకు అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకానికి మాత్రం తూట్లు పొడుస్తున్నది. జిల్లావ్యాప్తంగా 2,00,372 ఉపాధి హామీ కుటుంబాలుండగా, 4,38,398 మంది కూలీలున్నారు.
ఉపాధి హామీ పనులనే నమ్ముకొని బతుకుతున్న కూలీలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. పనులను భారీగా తగ్గించిన కేంద్రం వేల కుటుంబాల కడుపుకొడుతున్నది. దీంతో జిల్లాలో కూలీలు ఊర్లు వదిలి వలసలు పోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం అమల్లోకి తీసుకువచ్చి ఎన్నో కుటుంబాలకు ఉపాధిని దూరం చేస్తున్న కొత్త నిబంధనలపై జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలందరూ మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– వికారాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)
పేద ప్రజలకు ఉపాధి హామీ పనులను దూరం చేసేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. లక్షల మంది కూలీల కడుపు నింపుతున్న ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చేలా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే తప్పుడు నివేదికలు తెప్పించుకొని అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రచారం చేసి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. అందుకనుగుణంగానే గత నాలుగేండ్లుగా ఉపాధి హామీ పనిదినాలను భారీగా తగ్గిస్తున్నారు. కేవలం ఒక్క ఏడాదిలోనే 28 లక్షల పనిదినాలను తగ్గిస్తూ నిర్ణయించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 33 లక్షల పనిదినాలను మాత్రమే కల్పించాలని నిశ్చయించారు. గత నాలుగేండ్లలో 70 లక్షలకుపైగా పనిదినాలను జిల్లాలో తగ్గించారంటే ఉపాధి హామీ పథకంపై మోదీ ప్రభుత్వం ఏ స్థాయిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదో అర్థం చేసుకోవచ్చు.
కొత్త సాఫ్ట్‌వేర్‌తో ఇబ్బందులు
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ఎన్ఆర్ఈజీఎస్ సాఫ్ట్-ఎన్ఐసీ సాఫ్ట్‌వేర్‌తో జిల్లాలోని లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ పనులు దూరమయ్యాయి. కొత్త సాఫ్ట్వేర్ విధానంతో కూలీలు తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం పనులకు తప్పనిసరిగా హాజరుకావాలని షరతులను విధించింది. కూలీలు చేస్తున్న పనులకు సంబంధించి ఉదయం 11 గంటలలోపు ఒక ఫొటో, సాయంత్రం 2 గంటల తర్వాత రెండో ఫొటో తప్పనిసరిగా తీయడంతోపాటు అప్లోడ్ చేస్తున్నారు.
ఒక గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించి ఒక పని పూర్తైన తర్వాతనే మరొక పని చేపట్టాలని నిబంధన విధించారు. దీంతో గతంలో మాదిరిగా కాకుండా పనులు చాలా ఆలస్యమవుతున్నాయి. ప్రతిరోజూ చేపడుతున్న పనులను వెంటనే యాప్‌లో పొందుపర్చాలనే నిబంధనలతో క్షేత్రస్థాయిలో సిగ్నల్ లేకపోవడంతో అప్లోడ్ చేయడం ఇబ్బందిగా మారి పనుల్లో జాప్యం జరుగుతున్నది. నాలుగేండ్ల క్రితం 19,998 కుటుంబాలకు వంద రోజులపాటు పనులను కల్పించగా, గత ఆర్థిక సంవత్సరం కేవలం 3 వేల కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పనులను కల్పించారు.
పని దినాలు సంవత్సరాలవారీగా..
సంవత్సరం: పని దినాలు(లక్షల్లో)
2021-22: 103
2022-23: 71.58
2023-24: 62
2024-25: 59.85
2025-26: 33