బంట్వారం, జనవరి 2 : నిరుద్యోగుల పాలిట ‘టెట్’ పరీక్ష ఓ అగ్నిపరీక్షలా మారింది. ఇందుకు ప్రధాన కారణం పరీక్షా కేంద్రాలను సుదూర ప్రాంతాల్లో కేటాయించడం. వికారాబాద్ జిల్లా వాసులకు ప్రభుత్వం హన్మకొండలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీంతో అంత దూరం(సుమారు 400 కిలోమీటర్లు) ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. పరీక్షకు హాజరు కావాలంటే ఒక రోజు ముందు వెళ్లాల్సి వస్తుందని.. తిరిగి వెళ్లడానికి పరీక్ష మరుసటి రోజు రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మూడు రోజులకుగాను ఖర్చులు తడిసి మోపెడవుతాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల్లో సెంటర్లు కేటాయించడంతో పరీక్షలకు హాజరు కాలేమని కొందరు వాపోతున్నారు. ఇలాంటి చర్యలతో ప్రభుత్వం నిరుద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తూ ఆటలాడుకుంటున్నదని మండిపడుతున్నారు.
టెట్ నిర్వహణ గతంలో ఓఎంఆర్ పద్ధతిలో ఉండేది. దీంతో జిల్లాలో ఎన్ని అవసరముంటే అన్ని పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి, అభ్యర్థులకు సౌకర్యవంతంగా ఉండేల చర్యలు తీసుకునేవారు. దీంతో పరీక్షలు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేవారమని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)ని ఏర్పాటు చేయడంతో ప్రైవేట్ కంప్యూటర్ సెంటర్లపై ప్రభుత్వం ఆధారపడి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. అభ్యర్థులకు అవసరమైన కంప్యూటర్లు ప్రభుత్వం వద్ద లేకపోడంతో ప్రైవేటు సెంటర్లపై ఆధారపడాల్సిన దుస్థితి దాపురించిందని అభ్యర్థులు వాపోతున్నారు.
ఎంతో కష్టపడి టెట్ పరీక్షలకు ప్రిపేరయ్యాను. ఈసారి ఎలాగైనా పరీక్షలో ఎక్కువ మార్కు తెచ్చుకొని డీఎస్సీ రాద్దామనుకున్న. కాని పరీక్షా సెంటర్ హన్మకొండలో ఉండడంతో నివ్వెరపోయాను. ఇప్పుడు ఏమి చేయాలో తెలియక, చదువుపై కూడా ధ్యాస పెట్టలేకపోతున్నా. నా పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది.
– కె.ప్రభావతి, టెట్ అభ్యర్థి, రొంపల్లి, బంట్వారం మండలం
టెట్ రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని పట్టుదలతో చదువుకున్నా. తీరా సెంటర్ చూసి డీలా పడిపోయా. ఏమి చేయాలో అర్థం కావడంలేదు. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న హన్మకొండకు వెళ్లి పరీక్ష రాసేలా లేను. ప్రభుత్వం సెంటర్‌ను హైదారాబాద్‌కు మారిస్తే పరీక్ష రాస్తా.
– టి.యాదమ్మ, టెట్ అభ్యర్థి, వికారాబాద్