వికారాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో పత్తి రైతులకు ప్రతి ఏటా ఏదో రకంగా నష్టాలు తప్పడంలేదు. తొలుత సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జాప్యం కావడంతో వర్షాలకు పత్తి నష్టపోయిన అన్నదాతలను ప్రస్తుతం తేమ పేరిట దోపిడీ చేస్తున్నారు. పత్తిలో తేమ శాతం 8-12 శాతం కంటే ఎక్కువ ఉంటే ఆ పత్తిలో తేమ శాతాన్ని బట్టి మద్దతు ధరను తగ్గించి కొనుగోలు చేస్తారు. జిల్లాలోని పలు జిన్నింగ్ మిల్లుల్లో తేమ శాతం సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ తేమ శాతం ఎక్కువ శాతం ఉందంటూ సాకు చూపిస్తూ పత్తి రైతులను మోసం చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.
సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నిబంధనల ప్రకారం పత్తిలో తేమ శాతం 8-12 శాతం వరకు ఉంటే క్వింటాలుకు పత్తి మద్దతు ధర రూ.8110గా నిర్ణయించగా, అదే 12 శాతానికిపైగా తేమ ఉన్నట్లయితే క్వింటాలుకు రూ.100 నుంచి 300 వరకు తగ్గించి కొనుగోలు చేస్తున్నట్లు అన్నదాతలు చెప్తున్నారు. కొందరు రైతులు తీసుకువచ్చే పత్తిలో తేమ శాతం 12 శాతంలోపు ఉన్నప్పటికీ 12 శాతం కంటే ఎక్కువ తేమ శాతం ఉందంటూ చూపెడుతూ రూ.7800 వరకే కొనుగోలు చేస్తూ మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
సీసీఐ అధికారులతోపాటు జిన్నింగ్ మిల్లుల యజమానులు కుమ్మక్కై తమకు నష్టం కలిగిస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. జిన్నింగ్ మిల్లుల వరకు పత్తిని విక్రయించేందుకు తీసుకువచ్చిన రైతులు తిరిగి తీసుకెళ్లే పరిస్థితి ఉండదు కాబట్టి.. ఇదే అదునుగా భావిస్తున్న సంబంధిత అధికారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ దోచుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జిల్లాలో ఈ ఏడాది 2.54 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, 2 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 1579 మంది అన్నదాతల నుంచి 3065 మెట్రిక్ టన్నుల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది.
పేరుకు జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని చెబుతున్నప్పటికీ సేకరణ మాత్రం ఇంకా షురూ కాలేదని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సీసీఐ ఆధ్వర్యంలో 14 జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తిని సేకరించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించగా.. ఇప్పటివరకు 12 జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించామని సంబంధిత అధికారులు చెబుతున్నప్పటికీ కొనుగోళ్లు మాత్రం ప్రారంభంకాలేదు. కొనుగోళ్ల కోసం కొందరు రైతులు ఎదురుచూస్తుండగా, మరికొందరు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకోవాలనే నిబంధన పెట్టడంతో పత్తిని ఏరి ఇంట్లో పెట్టుకుని.. యాప్లో స్లాట్ బుక్ చేసుకోవడం వంటి కొర్రీలతో రైతులు ఇబ్బంది పడుతూ బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విక్రయిస్తూ నష్టపోతున్నారు. గత ఏడాది ఎకరాకు 12 క్వింటాళ్ల నిబంధన ఉండగా, ఈ ఏడాది ఎకరాకు 7 క్వింటాళ్లకు నిబంధనను కుదించింది. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వచ్చే పరిస్థితులున్నాయి. సీసీఐ పెట్టిన ఈ కొర్రీలతో బహిరంగ మార్కెట్కు తప్పని పరిస్థితుల్లో విక్రయించాల్సి వస్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బహిరంగ మార్కెట్లో రూ.6500 నుంచి 7 వేల వరకు మాత్రమే ఉంటున్నది.
మరోవైపు తాండూరులోని బాలాజీ, పూడూర్ మండలంలోని సాయిబాబా కాటన్ మిల్లో ఇంకా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు. కొనుగోలు కేంద్రాల్లో పత్తి సేకరణ ముమ్మరం కాకపోవడంతో పత్తిని తీసుకువస్తున్న రైతులు సంబంధిత మిల్లర్లకే బహిరంగ మార్కెట్ ధరకు విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా తీసుకుంటున్న మిల్లర్లు కొందరు రూ.6500 వరకు కొనుగోలు చేస్తున్నట్లు అన్నదాతలు వాపోతున్నారు. ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలతో పత్తి తడిసిపోవడంతో ఇంట్లో నిల్వ ఉంచుకోలేక తప్పని పరిస్థితుల్లో తక్కువ ధరకు విక్రయిస్తూ నష్టపోతున్నారు.