రంగారెడ్డి, మే 28 (నమస్తే తెలంగాణ) : వర్షాకాలం పంటల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలో నకిలీ విత్తన కంపెనీలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈమేరకు రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి నేతృత్వంలో జిల్లాలో రెండు టాస్క్ఫోర్స్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీల ఆధ్వర్యంలో నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పూర్తిస్థాయి అధికారం ఇచ్చారు. డివిజనల్, మండల స్థాయిలో కూడా ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవో, ఏడీఏ, ఏసీపీల ఆధ్వర్యంలో.. మండల స్థాయిలో తహసీల్దార్, వ్యవసాయాధికారి, సీఐల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు కానున్నాయి.
ఈ కమిటీల ఆధ్వర్యంలో జిల్లాలోని ఫెర్టిలైజర్ దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తారు. విత్తన కంపెనీలపై కూడా తనిఖీలు చేపట్టనున్నారు. జిల్లాస్థాయిలో టాస్క్ఫోర్స్ కమిటీలతోపాటు ప్రత్యేక స్వాడ్లు నిర్విరామంగా పనిచేయనున్నాయి. ముఖ్యంగా వ్యవసాయాధికారులు నకిలీ విత్తనాల పట్ల రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించినందున అందుకనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రైతులకవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈమేరకు కలెక్టర్ బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయాధికారులు, పోలీసులు, టాస్క్ఫోర్స్ అధికారులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఎక్కడా నకిలీ విత్తనాలు కనిపించకుండా చేయాలన్నారు.
వర్షాకాలంలో జిల్లాలో ఎక్కువ మంది రైతులు పత్తి, వరి, మొక్కజొన్న, ఇతర కూరగాయల పంటలతోపాటు ఆముదం పంట కూడా వేయనున్నారు. యాచారం, మంచాల, మాడ్గుల, తలకొండపల్లి, ఆమగనల్లు, కడ్తాల్, షాద్నగర్, కేశంపేట, కొందుర్గు, షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్ వంటి ప్రాంతాల్లో రైతులు పంటలు అధికంగా వేయనున్నందున నకిలీ విత్తనాలు విక్రయించే అవకాశమున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు, టాస్క్ఫోర్స్ కమిటీలు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా దాడులు చేసి నకిలీ విత్తనాలను అరికట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
– వ్యవసాయాధికారి నర్సింహారావు