మండలంలోని మేడిపల్లి ఫార్మా భూముల్లో బుల్డోజర్ల జోరు కొనసాగుతున్నది. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన పొలాల్లో రైతులు పంటలు వేయొద్దని అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఫార్మా కోసం సేకరించిన భూములను అన్నదాతలు సాగు చేయకుండా ఆర్ఐ మురళీకృష్ణ ఆధ్యర్యంలో సర్వేయర్లు, జీపీఓలు, సిబ్బంది బుల్డోజర్లు, డ్రోజర్లు, ఇటాచీలతో చదును చేయిస్తున్నారు. హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ వంశీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో జేసీబీలు, డ్రోజర్లు భూములను చదును చేస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించకుండా భూములను చదును చేయొద్దని కోరుతున్నారు.
– యాచారం, ఏప్రిల్ 24
మేడిపల్లిలో ఫార్మా కోసం సేకరించిన పట్టా, అసైన్డ్, కబ్జా భూముల్లో పంటలు వేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ అయ్యప్ప పర్యవేక్షణలో ఆర్ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఫార్మా భూములను చదును చేసే పక్రియ గత నాలుగైదు రోజులుగా జోరుగా కొనసాగుతున్నది. పొలాల్లో గెట్లను తొలగించడం, వరదకట్టలు, చెక్‌డ్యాంలు, రాతికట్టడాలు, రాళ్ల కుప్పలు, చెట్ల పొదలను పొలాల్లోకి నెట్టి అన్నదాతలు పంటలు సాగు చేయకుండా భూమంతా గజిబిజి చేస్తున్నారు. కొంత మంది రైతులు వరి పంట సాగుచేయగా.. మరికొంత మంది మామిడి, కూరగాయల తోటలు సాగు చేస్తున్నారు. ఇదే చివరి అవకాశమని.. ఇకపై పంటలు సాగు చేయొద్దని అన్నదాతలను అధికారులు హెచ్చరిస్తున్నారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మేడిపల్లి తరువాత నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల భూములను చదును చేసేందుకు అధికారులు ప్రణాళికలను రచిస్తున్నారు.
కోర్డు కేసులున్నా భూముల చదును
కోర్టు కేసులు ఉన్న భూముల జోలికి వెళ్లబోమని చెప్పిన రెవెన్యూ అధికారులు మేడిపల్లిలోని సర్వే నం.74, 75లలోగల దోస సాలయ్య, దోస గుండాలు, దోస రమేశ్, దోస మహేశ్, దోస వెంకటయ్య, దోస బుచ్చయ్య, దోస మల్లయ్య, దోస ఇందిర తదితర రైతులకు చెందిన 18.3 ఎకరాల భూమి కోర్టు కేసులో ఉన్నది. ఈ భూమిని అన్నదాతలు ఫార్మాకు ఇవ్వలేదు, ఎలాంటి ప్రభుత్వ పరిహారం తీసుకోలేదు. కానీ అధికారులు ఈ రైతుల పొలాలను జేసీబీలతో చదును చేయడం, పొలాలను చెడగొట్టడంతో అన్నదాతలు అధికారుల తీరుపై సీరియస్ అవుతున్నారు. తమ భూములను ఫార్మాకు ఇవ్వలేదని, ఎలాంటి పరిహారం తీసుకోలేదని.. తమ భూముల్లోకి ఎలా అడుగుపెడతారని మండిపడుతున్నారు. అక్రమంగా తమ భూముల్లోకి వస్తే ఊరుకునేదిలేదని వారు హెచ్చరిస్తున్నారు.
ప్లాట్ల డాక్యుమెంట్లు ఇస్తేనే భూముల జోలికి రావాలి
ఫార్మా కోసం భూములు కోల్పోయిన బాధిత రైతులకు అదనపు పరిహారం కింద ఇవ్వాల్సిన ఎకరాకు 121 గజాల ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇస్తేనే తమ భూముల్లోకి వచ్చి జేసీబీలతో చదును చేయాలని, రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చే వరకు భూముల్లోకి రావొద్దని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. తమ పొలంలో పనులు చేయాలని వచ్చిన అధికారులను మక్కపల్లి రాములు, చంద్రయ్య అనే రైతులు వెళ్లగొట్టారు. ప్లాట్ల కాగితాలు ఇచ్చినంకనే ఇక్కడికి రావాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అధికారులు ఒకసారి ఆలోచించి వెంటనే ఫార్మా ప్లాట్ల డాక్యుమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మా భూముల్లో పనులు చేయొద్దు
మా భూములను మేము ఫార్మాసిటీకి ఇవ్వలేదు. ఇప్పటివరకు ఎలాంటి సర్కారు డబ్బులు తీసుకోలేదు. మా భూములను ప్రభుత్వానికి ఇవ్వనప్పుడు ఎలా జేసీబీలతో పనులు చేస్తారు. మా పొలాన్ని అడ్డదిడ్డంగా చేసిన అధికారులు తిరిగి యథావిధిగా చేయాలి. మాకు సర్కారు సరైన పరిహారం ఇస్తేనే మా భూములను ప్రభుత్వానికి ఇస్తాం. అప్పటివరకు మా భూముల్లో ఎలాంటి పనులు చేయాలని చూసినా ఊరుకునేదిలేదు. సర్కారు స్పందించేవరకు మా భూములను మేం సాగు చేసుకుంటాం, నచ్చిన పంటలను వేసుకుంటాం. ఎవరైనా బలవంతంగా భూముల జోలికొస్తే తరిమికొడతాం.
– దోస సాలయ్య, రైతు, మేడిపల్లి
డాక్యుమెంట్లు ఇచ్చాకే పనులు చేయాలి
ఫార్మా ప్లాట్ల డాక్యుమెంట్లు అన్నదాతలకిచ్చిన తరువాతే భూములను చదును చేయాలి. అప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టొద్దు. బలవంతంగా పనులు చేస్తే అడ్డుకొని తీరుతాం. ఫార్మా ప్లాట్ల రిజిస్ట్రేషన్ పత్రాలివ్వడంలో అధికారులు తమ నిర్లక్ష్యాన్ని వీడాలి. వెంటనే అర్హులైన రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్ పత్రాలివ్వాలి.
– ఆలంపల్లి నరసింహ, సీపీఎం మండల కార్యదర్శి
పొలాలు చదును చేయడం కోర్టు ధిక్కారం
కోర్టు స్టే ఉన్న పొలాలను అధికారులు చదును చేయడం కోర్టు ధిక్కారం. ఫార్మా కోసం సేకరించిన భూములపై ఉపాధి కూలీలు కోర్టులో కేసు వేశారు. గ్రామంలో భూములన్నీ ప్రభుత్వం తీసుకోవడంతో తమకు పని లేకుండా పోతున్నదని వ్యవసాయ, ఉపాధి కూలీలు కోర్టును ఆశ్రయించారు. కూలీలకు తగిన నష్టపరిహారంతో పాటు తగిన ఉపాధిని చూపించాకే భూములను స్వాధీనం చేసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కూలీలకు న్యాయం చేశాకే పనులు చేపట్టాలి. లేదంటే ఊరుకునేదిలేదు.
– కానమోని గణేష్, ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు