కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయం, మోసంపై వారికి అండగా ఉండి పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించనుంది. రేవంత్ సర్కార్ పెట్టుబడి సాయానికి ఎగనామం పెట్టడం, రుణమాఫీలోనూ కొర్రీలు పెట్టి అర్హులకు అన్యాయం చేయడం, ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు, పత్తి కొనుగోళ్లను ప్రారంభించకపోవడంతో బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విక్రయిస్తూ నష్టపోతున్న అన్నదాతలకు అండగా నిలవాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.
అందులో భాగంగానే త్వరలో వికారాబాద్ నియోజకవర్గంలో రైతు ధర్నా జరుగనున్నది. దీనికి కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, పెద్ద ఎత్తున రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొననున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతోపాటు మూసీ, నేవీ రాడార్ సెంటర్ ఏర్పాటుపై కేటీఆర్ గళమెత్తనున్నారు.
– వికారాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ)
పెట్టుబడి సాయానికి ఎగనామం..
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. రైతుభరోసా పథకంలో భాగంగా ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పినా ఇప్పటికీ దాని ఊసేలేదు. గత యాసంగిలోనే రైతు భరోసాను ప్ర భుత్వం అమల్లోకి తీసుకొస్తుందని ఆశించిన రైతులకు భంగపాటే ఎదురైంది. ఎకరాకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందించి చేతులు దులుపుకొన్నది.
వానకాలంలో రైతు భరోసాపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో అన్నదాతలు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకొచ్చి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి పంటలను సాగు చేశారు. నమ్మి గెలిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా మోసి చేసిందంటూ అన్నదాతలు దుమ్మెత్తి పోస్తున్నారు. మరోవైపు రైతుబంధు పథకం కింద బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలోని రైతాంగానికి రూ.2,926 కోట్ల సాయాన్ని పెట్టుబడి నిమిత్తం అందజేసింది.
2018 వానకాలంలో 1,94, 833 మంది రైతులకు రూ.221 కోట్లు, యాసంగిలో 1,75,989 మందికి రూ. 206 కోట్లు, 2019 వానకాలంలో 1,78,998 మందికి రూ.255 కోట్లు, యాసంగిలో 1,71,824 మందికి రూ.194 కోట్లు, 2020 వానకాలంలో 2,113,341 మందికి రూ.297 కోట్లు, యాసంగిలో 2,19,264 మందికి రూ.301 కోట్లు, 2021 వానకాలంలో 2,25,438 మందికి రూ.300 కోట్లు, యాసంగిలో 2,24, 928 మందికి రూ.241 కోట్లు, 2022-23 వానకాలంలో 2,47,707 మందికి రూ.305 కోట్లు, యాసంగిలో 2,43,447 మందికి రూ.299 కోట్లు, 2023-24 వానకాలంలో 2,62,065 మంది రైతులకు రూ.307.47 కోట్ల పెట్టుబడి సాయా న్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం జమ చేసి ఆదుకున్నది.
కొందరికే రుణమాఫీ..
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అమలుకు పెట్టిన నిబంధనలు, కొర్రీలతో జిల్లాలోని కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరింది. బీఆర్ఎస్ హయాంలో రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తే 1,26,000 మంది రైతులకు లబ్ధి చేకూరితే, కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన షరతులతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన రైతుల్లో కనీసం సగం మందికి కూడా మాఫీ కాలేదు. పట్టాదారు పాసుపుస్తకాలను పరిగణనలోకి తీసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతోనే దాదాపు లక్ష మంది రైతులు నష్టపోయారు.
అయితే జిల్లాలో సుమారు 1,70,000 మంది రైతులు పంట రుణాలను తీసుకుంటే వారిలో 91,956 మంది రైతుల రుణాలే మాఫీ అయ్యాయి. అయితే మొదటి విడతలో రూ.లక్ష లోపు 46,633 మంది రైతులకు రూ.256.26 కోట్ల రుణమాఫీ కాగా, రెండో విడతలో రూ.లక్షన్నర లోపు 26,438 మందికి రూ.265.04 కోట్లు, చివరి విడతలో రూ.2 లక్షల లోపు 18,885 మందికి రూ.247.71 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. కాగా తమ పంట రుణాలు మాఫీ కాలేదంటూ జిల్లాలో ఏర్పాటుచేసిన గ్రీవెన్స్ సెల్‌కు 6,729 మంది రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.
రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకోవడం, ఒకరి ఆధార్నంబర్కు బదులు మరొకరి ఆధార్ ఎంట్రీ చేయడం, వడ్డీని కలపకుండా కేవలం రైతులు తీసుకున్న రుణాలను మాత్రమే ఎంట్రీ చేయ డం తదితర కారణాలతో జిల్లాలో దాదాపు 80,000 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. మరోవైపు రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైనది. కటాఫ్ రుణానికి మించి ఉన్న రైతుల్లో చాలామంది ఇప్పటికే పైన ఉన్న మొత్తాన్ని చెల్లించినా ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మా ఇంట్లో ముగ్గురు ఉంటే ఒక్కరికీ మాఫీ కాలేదు.
మా ఇంట్లో ముగ్గురం బ్యాంకు రుణాలు తీసుకుంటే ఒక్కరికీ మాఫీ కాలేదు. నా పేరున 1.5 ఎకరాల పొలం ఉండగా రూ.1, 20,000 రుణం తీసుకున్నా. ఇంద్రమ్మ పేరున రెండు ఎకరాలుండగా రూ. 1,60,000 రుణం, రాజేందర్ పేరున 1.08 ఎకరాల భూమి ఉండగా రూ. 80వేల రుణం ఉన్నది. గత కేసీఆర్ ప్రభుత్వంలో అందరి రుణాలు మాఫీ అయ్యాయి. ఇప్పుడు బీఆర్ఎస్ మా కోసం పోరాడుతున్నందుకు కొండంత ధైర్యం వస్తున్నది.
– మొగ్దుంపూర్ రాచప్ప, రైతు, బంట్వారం
రైతు భరోసా ఎప్పుడొస్తది ?
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా ఎప్పుడు వేస్తదో తెలియని పరిస్థితి. ఈసారి సాగుకు అప్పులు చేసినా. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడాదికి రెండు సార్లు పెట్టుబడి పైసలు వచ్చేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. ‘రైతుబంధు’కు ఎగనామం పెట్టింది. బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలువడం సంతోషకరం. రైతులకు పాటుపడే బీఆర్ఎస్తో కలిసి ఈ దగాకోరు కాంగ్రెస్‌పై పోరాటం చేస్తం.
– పట్లోళ్ల బలవంత్‌రెడ్డి, కొత్లాపూర్, మర్పల్లి
కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది..
రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. నాకు 24 గుంటల భూమి ఉన్నది. వికారాబాద్ కెనరా బ్యాంకులో రూ.34 వేల రుణం తీసుకున్నా. రెన్యూవల్ కూడా చేశా. కానీ మాఫీ కాలె. బ్యాంకు, వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకెళ్తే తర్వాత వస్తుందంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా రైతుల కోసం పని చేస్తది. కేసీఆర్ హయాంలో రైతులకు ఎలంటి ఇబ్బంది రాలె.
– సంద నర్సింహులు, కొంపల్లి, వికారాబాద్
రైతుభరోసా జాడే లేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా పథకంలో ఎకరానికి రూ.15 వేలు ఇస్తనన్నది. ఇప్పటికీ ఆ జాడే లేదు. పెట్టుబడికి లేక ఎన్నో ఇబ్బందులు పడినం. గతంలో కేసీఆర్ ఠంచన్‌గా పెట్టుబడి సాయం వేసేది. ఈ మోసపూరిత కాంగ్రెస్‌పై రైతుల తరఫున బీఆర్ఎస్ కొట్లాడుతుండడం మాకు భరోసా వస్తున్నది. మా బాధలను అర్థం చేసుకునే బీఆర్ఎస్ పార్టీ వెంటే మేము ఉంటాం. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తే మంచింది.
– ఎండీ ఖాజాపాషా,రైతు, బంట్వారం